Trump- Zelensky: యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమే.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన
ABN, Publish Date - Aug 16 , 2025 | 03:42 PM
రష్యాతో యుద్ధం ముగింపు దిశగా నిర్మాణాత్మక సహకారం అందించేందుకు తాను సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ట్రంప్‌తో చర్చల కోసం సోమవారం తాను అమెరికా వెళ్లనున్నట్టు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగించే దిశగా నిర్మాణాత్మక సహకారాన్ని అందించేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు త్వరలో అమెరికా వెళ్లనున్న జెలెన్‌స్కీ ఈ కామెంట్ చేశారు. కేవలం కాల్పుల విరమణ కాకుండా శాంతిని నెలకొల్పేందుకు పుతిన్ సమగ్ర ఒప్పందాన్ని ఆశిస్తున్నట్టు ట్రంప్ జెలెన్‌స్కీకి తెలిపినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
సోమవారం అమెరికా వెళ్లనున్నట్టు జెలెన్‌స్కీ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకే వాషింగ్టన్ వెళుతున్నట్టు చెప్పారు. ఫిబ్రవరిలో శ్వేత సౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో జరిగిన రసాభాస తరువాత జెలెన్‌స్కీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి.
అలాస్కాలో ఇటీవల ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఎటూ తేలకుండా ముగిసిన విషయం తెలిసిందే. మీటింగ్ తరువాత తిరుగుప్రయాణంలో డొనాల్డ్ ట్రంప్ జెలెన్‌స్కీతో పాటు ఇతర ఐరోపా దేశాల నేతలతో మాట్లాడారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఏకంగా గంటకు పైగానే చర్చించారు. కాల్పుల విరమణ ఒప్పందం బదులు పూర్తిస్థాయిలో శాంతి నెలకొల్పేందుకు పుతిన్‌తో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని జెలెన్‌స్కీకి ట్రంప్ సూచించినట్టు తెలిసింది.
ఇక ట్రంప్‌తో సుదీర్ఘమైన చర్చ జరిగిందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం ఏర్పాటుకు కూడా తాను మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అంశంలో అమెరికా పాత్ర కూడా ముఖ్యమేనని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం రూపకల్పనకు సంబంధించి ప్రతి దశలో ఐరోపా దేశాల నేతలు కూడా పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. అమెరికాపై తనకు పూర్తి నమ్మకం లేదన్న విషయాన్ని జెలెన్‌స్కీ ఈ సూచనతో పరోక్షంగా చెప్పారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
కేవలం 24 గంటల్లో యుద్ధం ముగిస్తానని మాట ఇచ్చి మరీ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన అధ్యక్షుడై ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక అలాస్కా మీటింగ్‌లో ఎలాంటి ఒప్పందాలు జరగకపోయినప్పటికీ ఇరు దేశాధీనేతల మధ్య కొంత మేర సఖ్యత, మరి కొంత ఆధిపత్య ధోరణుల ప్రదర్శనలు కనిపించాయి.
ఇవి కూడా చదవండి:
పాక్‌లో రుతుపవనాల బీభత్సం.. 150 పైచిలుకు మంది దుర్మరణం
ఇలాగైతే భారత్‌పై యుద్ధం మినహా పాక్‌కు మరో మార్గం ఉండదు: బిలావల్ భుట్టో హెచ్చరిక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 16 , 2025 | 04:30 PM