Share News

Pak Monsoon Floods: పాక్‌లో రుతుపవనాల బీభత్సం.. 150 పైచిలుకు మంది దుర్మరణం

ABN , Publish Date - Aug 15 , 2025 | 09:12 PM

పాక్‌లో రుతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు ఖైబర్ పాఖ్‌తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కుంభవృష్టి కారణంగా వరదలు పోటెత్తి, కొండచరియలు విరిగి పడి పదుల సంఖ్యలో జనాలు దుర్మరణం చెందారు.

Pak Monsoon Floods: పాక్‌లో రుతుపవనాల బీభత్సం.. 150 పైచిలుకు మంది దుర్మరణం
Pakistan monsoon floods

ఇంటర్నెట్ డెస్క్: రుతుపవనాలు పాక్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కుండపోత వర్షాల కారణంగా వరదలు పొటెత్తి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగి పడి మరికొందరు దుర్మరణం చెందారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూడా భారీ వర్షాలు అనేక మందిని పొట్టనపెట్టుకున్నాయి.

స్థానిక అధికారుల ప్రకారం, పాక్‌లో ఖైబర్‌పాఖ్‌తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక మంది బలయిపోయారు. గత 24 గంటల్లోనే 125 మంది మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను కాపాడేందుకు విపత్తు నిర్వహణ సిబ్బంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వనరులను క్షతగాత్రుల కోసం వినియోగించాలని అక్కడి ముఖ్య మంత్రి ఆదేశించారు.

ఇక పాక్ ఆధీనంలోని గిల్గిట్ బాల్టిస్థాన్‌ కూడా భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. గిజర్ జిల్లాలో ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి 8 మంది మరణించగా మరో ఇద్దరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రధాన రవాణా మార్గాలైన కరకోరం హైవే, బాల్టిస్థాన్ హైవే మార్గాల్లో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇక నీలమ్ లోయలోని బేస్ క్యాంపునకు ఉన్న మార్గం కూడా మూసుకుపోవడంతో పర్యాటకులు చిక్కుకుపోయారు. కుందల్ షాహీలోని ఓ రెస్టారెంట్‌ను వరదలు పూర్తిగా ముంచెత్తాయి. పలు ఇళ్లు కూడా నీట మునిగాయి.


జూన్ నెల చివరి నుంచి పలుమార్లు కురిసిన కుండ పోత వర్షాల కారణంగా పాక్‌లో ఇప్పటివరకూ 325 మంది కన్నుమూశారు. వీరిలో 124 మంది చిన్నారులు కూడా ఉన్నారని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం కూడా భారీగానే సంభవించింది. పలు స్కూల్లు, చిన్న చిన్న ఆసుపత్రులు, రోడ్లు వంటి మౌలిక వసతులు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లో వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

క్షతగాత్రులకు కాపాడేందుకు పాక్‌లో పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. విపత్తు నిర్వహణ దళాలతో పాటు పాక్ ఆర్మీ, వలంటీర్లు కూడా సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వరద ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అక్కడి అధికారులు ప్రజలకు సూచించారు.


ఇవి కూడా చదవండి:

కాసేపట్లో పుతిన్‌తో సమావేశం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇలాగైతే భారత్‌పై యుద్ధం మినహా పాక్‌కు మరో మార్గం ఉండదు: బిలావల్ భుట్టో హెచ్చరిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 15 , 2025 | 09:20 PM