Share News

Donald Trump: కాసేపట్లో పుతిన్‌తో సమావేశం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 08:29 PM

మరి కాసేట్లో ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశంలో ఉక్రెయిన్‌పై చర్చ ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు కోసం పుతిన్‌ను చర్చలకు కూర్చోబెట్టాలనేదే తన ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ముగిసే వరకూ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కూడా ఉండవని పేర్కొన్నారు.

Donald Trump: కాసేపట్లో పుతిన్‌తో సమావేశం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Trump Putin Alaska summit

ఇంటర్నెట్ డెస్క్: మరి కాసేపట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అలాస్కా వేదికగా చర్చలు జరగనున్నాయి. 2022 తరువాత అమెరికాలో కాలు పెట్టడం పుతిన్‌కు ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ట్రంప్-పుతిన్ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాస్కాకు బయలుదేరిన ట్రంప్ మార్గమధ్యంలో మీడియాతో సంభాషించారు. పుతిన్‌తో చర్చల గురించి తన మనసులో మాటను పంచుకున్నారు.

ఉక్రెయిన్‌పై తమ మధ్య ఎలాంటి చర్చలు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. పుతిన్‌ను చర్చలకు దింపడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎన్నో ప్రాణాలు కాపాడేందుకు ఈ చర్చలకు వెళుతున్నట్టు చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పెట్టడానికే తొలి ప్రాధాన్యం ఇస్తానని ట్రంప్ పేర్కొన్నారు.


అయితే, ఈ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తాననే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. రష్యా సహకరించని పక్షంలో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా స్పష్టం చేశారు. రష్యా ప్రస్తుత ఆర్థిక స్థితిని బట్టి.. పుతిన్‌తో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ‘పుతిన్ తెలివిగలవాడు. అనుభవజ్ఞుడు. నేను అంతే. మా మధ్య పరస్పర గౌరవం ఉంది. కాబట్టి, మంచి ఫలితమే ఉండొచ్చు’ అని ట్రంప్ కామెంట్ చేశారు.

పుతిన్ వెంట రష్యా వ్యాపారవేత్తలు కూడా రావడంపై ట్రంప్ మాట్లాడారు. ఇది శుభపరిణామమని కామెంట్ చేశారు. అమెరికాతో కలిసి పనిచేసేందుకు రష్యా సిద్ధంగానే ఉందనేందుకు ఇది సంకేతమని వ్యాఖ్యానించారు. అయితే, యుద్ధం విషయం తేలే వరకూ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు ఉండవని కూడా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

భారత్‌కు ఎన్నడూ మర్చిపోలేని గుణపాఠం చెబుతాం.. పాక్ ప్రధాని హెచ్చరిక

ఇలాగైతే భారత్‌పై యుద్ధం మినహా పాక్‌కు మరో మార్గం ఉండదు: బిలావల్ భుట్టో హెచ్చరిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 15 , 2025 | 08:37 PM