Afghan Foreign Minister: మమ్మల్ని టెస్ట్ చేయొద్దు.. భారత్ గడ్డ పైనుంచి పాక్‌కు అఫ్గాన్ మంత్రి వార్నింగ్..
ABN, Publish Date - Oct 10 , 2025 | 06:31 PM
తమ ధైర్యాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దంటూ అఫ్గానిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి అమిర్ ఖాన్ ముత్తకీ భారత్ గడ్డ పైనుంచి పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమతో పెట్టుకుంటే ఏమవుతుందో రష్యా, అమెరికాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ భూ భాగంలో ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలను అనుమతించబోమని తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమిర్ ఖాన్ ముత్తకీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన మీడియా సమావేశంలో పాక్‌ను ఉద్దేశిస్తూ ఈ కామెంట్స్ చేశారు. అఫ్గానిస్థానీల ధైర్యసాహసాలకు పరీక్ష పెట్టొద్దని కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాబుల్‌లోని తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ పాక్ దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. అయితే, అఫ్గాన్ ను కేంద్రంగా చేసుకుని తమపై దాడులు చేస్తున్న ఉగ్రవాదుల తీరుతో సహనం నశించి ప్రతి దాడి చేస్తున్నామని పాక్ పేర్కొనడం గమనార్హం.
పాక్ దాడులపై అఫ్గాన్ మంత్రి ముత్తకీ స్పందించారు. ‘సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాలపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది. పాక్ తప్పు చేస్తోంది. దాదాపు 40 ఏళ్ల తరువాత అఫ్గానిస్థాన్ లో శాంతి నెలకొంది. అభివృద్ధి కనిపిస్తోంది. ఈ సమయంలో మా ధైర్యసాహసాలను పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే ఏం జరుగుతుందో రష్యా, అమెరికా, నాటోలను వెళ్లి అడగొచ్చు. అఫ్గాన్ తో గేమ్స్ వద్దని వారు చెబుతారు’ అని ముత్తకీ వార్నింగ్ ఇచ్చారు.
సీమాంతర ఉగ్రవాదం అంశంలో గత కొన్ని నెలలుగా పాక్, అఫ్గానిస్థాన్ మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం భారత్‌తో దౌత్య బంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించడం పాక్‌కు కంటగింపుగా మారింది. ఈ క్రమంలోనే సీమాంతర దాడులకు దిగొద్దంటూ పాక్‌ను అఫ్గాన్ మంత్రి హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో సమస్యలు పరిష్కారం కావని హెచ్చరించారు. ఇక అఫ్గానిస్థాన్ సౌర్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని ముత్తకీకి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
భారతీయ స్టూడెంట్ రాకపోతే మన భవిష్యత్తుకు ఇబ్బందే.. అమెరికా బిలియనీర్ హెచ్చరిక
అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 10 , 2025 | 08:44 PM