Ken Griffin on H-1b: భారతీయ స్టూడెంట్ రాకపోతే మన భవిష్యత్తుకు ఇబ్బందే.. అమెరికా బిలియనీర్ హెచ్చరిక
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:28 PM
భారత్, చైనా నుంచి టాలెంట్ విద్యార్థులు అమెరికాకు రాకపోతే దేశంలో సృజనాత్మకత కుంటుపడే అవకాశం ఉందని అమెరికన్ బిలియనీర్ ఇన్వెస్టర్ కెన్ గ్రిఫిన్ హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసాపై (H-1B visa Fee Hike) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు తమ ప్రభావం చూపించడం ప్రారంభించాయి. జులై, ఆగస్టు నెలల్లో అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. చదువు పూర్తయ్యాక అమెరికా ఉద్యోగ వీసా రాకపోతే ఎలా అన్న ఉద్దేశంతో అనేక మంది స్వదేశంలోనే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అమెరికా ఇన్వెస్టర్, బిలియనీర్ కెన్ గ్రిఫిన్ (Ken Griffin on H-1b) కీలక హెచ్చరికలు చేశారు.
సిటాడెల్ సంస్థ సీఈఓ అయిన గ్రిఫిన్ తాజాగా బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను పంచుకున్నారు. హెచ్-1బీ వీసా పీజు పెంపు అసలు నష్టమే కాదని కామెంట్ చేశారు. వీసా ఫీజు పెంపు కారణంగా భారత్ లేదా చైనా నుంచి టాలెంటెడ్ విద్యార్థులు అమెరికాకు రాకుండా స్వదేశంలో ఉండిపోతే అప్పుడు అమెరికాకు అసలు నష్టం కలుగుతుందని అన్నారు (US visa barriers).
‘ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ స్థితి ప్రకారం, ఓ వ్యక్తిని నియమించుకునేందుకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ వీసా ఫీజుల కారణంగా భారత్ నుంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ అమెరికాకు రారేమో అనేదే నా ఆందోళన. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో అద్భుత ప్రతిభ ఉన్న ఓ చైనా విద్యార్థి స్వదేశంలోనే ఉండిపోవచ్చని నా భయం’ అని ఆయన కామెంట్ చేశారు. అద్భుత ప్రతిభ కలిగిన విదేశీ విద్యార్థులు అమెరికాను కాక ఇతర దేశాలను ఎంచుకుంటే సృజనాత్మకతలో యూఎస్ వెనకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు (foreign talent migration).
మే నెలలో ఓ సందర్భంలో ఆయన దాదాపు ఇలాంటి కామెంట్స్ చేశారు. అమెరికా యూనివర్సిటీల్లో చదువుకునే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తి కాగానే అమెరికా వీసా ఇచ్చేయాలని కామెంట్ చేశారు. ‘అమెరికాకు వెల్‌కమ్. ఇక్కడే ఉండండి.. మీ కెరీర్ నిర్మించుకోండి’ అనేలా విదేశీ విద్యార్థులకు స్వాగతం పలకాలని అభిప్రాయపడ్డారు.
‘అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు ఇక్కడే ఉండిపోవాలన్న అభిప్రాయంతో చాలా మంది సెనెటర్లు అంగీకరిస్తారు. మరి విదేశీ స్టూడెంట్‌లకు వీసాలు, పౌరసత్వాలు ఇవ్వడంలో ఈ సంకోచం ఎందుకో అనే విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదు’ అని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీకి పలుమార్లు ఎన్నికల నిధులు ఇచ్చిన గ్రిఫిన్ ఈ కామెంట్స్ చేయడం కొసమెరుపు
ఇవి కూడా చదవండి:
అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం
హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి