Share News

H-1b Lawsuit: హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:35 PM

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా అమెరికాలో న్యాయపోరాటం ప్రారంభమైంది. వీసా ఫీజు పెంచే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదంటూ పలు సంస్థలు శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

H-1b Lawsuit:  హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్
H-1B visa lawsuit

ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నిర్ణయాన్ని సవాలు చేస్తూ వివిధ యూనియన్లు, సంస్థలు, మత సంఘాలు అమెరికాలో న్యాయపోరాటం ప్రారంభించాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఇష్టారీతిన తీసుకున్నట్టు ఉందని అభ్యంతరం వ్యక్తం చేశాయి. శాన్‌‌ఫ్రాన్‌సిస్కోలోని ఓ ఫెడరల్‌ కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన తొలి పిటిషన్ ఇది. యూనైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఓ నర్సు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో పాటు మరికొన్ని సంస్థలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి (Petition Against H-1b Visa Fee Hike) .

విదేశీయుల రాకను అడ్డుకునేందుకు అధ్యక్షుడికి ఉన్న అధికారాలు హెచ్-1బీ వీసా చట్టానికి లోబడి ఉండాలని పిటిషనర్లు పేర్కొన్నారు. సమగ్రమైన ఈ చట్టబద్ధ వీసా విధానాన్ని మార్చే అధికారం ఆయనకు లేదన్నారు. అమెరికాకు ఆదాయం పెంచే ప్రయత్నం పేరిట ఫీజులు, పన్నులను విధించే అధికారం అమెరికా చట్టసభల పరిధిలోని అంశమని వాదించారు.


ట్రంప్ ఆదేశాల కారణంగా హెచ్-1బీ వీసా విధానం పూర్తిస్థాయిలో మారిపోయిందని పిటిషనర్లు పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పేరిట మినహాయింపు పొందడం, లేదా భారీ మొత్తం చెల్లించి ఉద్యోగులను తెచ్చుకోవడమన్న రెండు ప్రత్యామ్నాయాలే సంస్థలకు మిగిలాయని తెలిపారు. ఎవరికి మినహాయింపు ఇవ్వాలన్న నిర్ణయం అమెరికా అంతర్గత వ్యవహారాల విభాగం, వలసల విభాగానికి ఉండటంతో నిబంధనలు ఇష్టారీతిన అమలయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇది అవినీతికి దారి తీయొచ్చని కూడా హెచ్చరించారు. భారీ ఫీజుల కారణంగా సృజనాత్మకతకు అడ్డుకట్ట పడే విషయాన్ని కూడా పట్టించుకోలేదని అన్నారు.

ఈ విషయంలో శ్వేత సౌధం ఇప్పటికే తన చర్యలను సమర్థించుకుంది. హెచ్-1బీ వీసా విధానాన్ని కంపెనీలు దుర్వినియోగపరచకుండా, అమెరికన్ల జీతాలు తగ్గకుండా చట్టబద్ధమార్గంలో ఈ చర్య తీసుకున్నట్టు శ్వేత సౌధం ప్రతినిధి ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ బోటుపై అమెరికా మిలిటరీ దాడి.. నలుగురు మృతి

హమాస్‌కు ట్రంప్ అల్టిమేటమ్.. దారికి రాకపోతే నరకం మొదలవుతుందంటూ వార్నింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 04 , 2025 | 12:58 PM