US Military Strike: డ్రగ్స్ బోటుపై అమెరికా మిలిటరీ దాడి.. నలుగురు మృతి
ABN , Publish Date - Oct 04 , 2025 | 09:08 AM
డ్రగ్స్ తరలిస్తున్న బోటుపై దాడి చేశామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్‌సెత్ తాజాగా పేర్కొన్నారు. ఈ దాడిలో నలుగురు మరణించినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మాదక ద్రవ్యాలను తరలిస్తున్న బోటుపై అమెరికా మిలిటరీ తాజాగా జరిపిన దాడిలో నలుగురు మృతి చెందారు. వెనిజులా దేశ తీరానికి సమీపంలో శుక్రవారం ఈ దాడి జరిగిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్‌సెత్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పటివరకూ అమెరికా ఇలాంటి నాలుగు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కనీసం 21 మంది మరణించి ఉంటారని అంచనా. ‘తాజా దాడిలో నలుగురు నిందితులు కన్నుమూశారు. వెనిజులా తీరానికి సమీపంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఈ దాడి జరిగింది. భారీ స్థాయిలో వారు మాదకద్రవ్యాలను అమెరికాకు తరలిస్తున్నారు. అమెరికా ప్రజలకు మాదకద్రవ్యాల ముప్పు తొలగిపోయే వరకూ ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి’ అని హెగ్‌సెత్ పేర్కొన్నారు (US Military strikes Drugs Boat).
డ్రగ్ కార్టెల్స్‌గా పిలిచే మాదక ద్రవ్యాల ముఠాలపై పోరు చివరి వరకూ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అక్కడి చట్టసభల సభ్యులకు తెతలిపారు. అయితే, డ్రగ్స్ కార్టెల్స్‌నే టార్గెట్ చేస్తున్నామనేందుకు అమెరికా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయితే, ఈ దాడులు చట్ట వ్యతిరేకమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఈ ముఠాలను అమెరికా ప్రభుత్వం విదేశీ సాయుధ దళాలుగా పేర్కొంది. వాటి చర్యలను అమెరికాపై దాడిగా అభివర్ణించింది (Venezuela maritime drug interdiction).
సెప్టెంబర్ 15న డ్రగ్స్ మూకలపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలతో చట్టసభలకు నోటీసు పంపించామని శ్వేత సౌధం అధికారి ఒకరు తెలిపారు. అమెరికా దళాల దాడుల తరువాత అక్కడి చట్టసభలను ప్రభుత్వం అప్రమత్తం చేయాలని చట్టం చెబుతోంది.
ఇక తాజాగా దాడికి సంబంధించిన వీడియోను ట్రంప్ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాదాపు 50 వేల మంది అమెరికన్లను చంపేందుకు ఉద్దేశించిన విషాన్ని అడ్డుకున్నామని అన్నారు. అమెరికా చర్యపై కొలంబియా అధ్యక్షుడు మండిపడ్డారు. డ్రగ్స్ నిందితులు ఇలా బోట్లల్లో ప్రయాణించరని, వారు అమెరికాలో లేదా ఐరోపా, దుబాయ్‌లల్లో ఉంటారని తెలిపారు. అమెరికా దాడిలో మరణించిన వారు కరీబియన్ ప్రాంతానికి చెందిన పేద యువత అని విచారం వ్యక్తం చేశారు. బోటును అడ్డుకునే అవకాశం ఉండగా దాడికి దిగడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఇది హత్య అని అభివర్షించారు.
ఇవి కూడా చదవండి:
హమాస్‌కు ట్రంప్ అల్టిమేటమ్.. దారికి రాకపోతే నరకం మొదలవుతుందంటూ వార్నింగ్
ట్రంప్ మళ్లీ షాకింగ్ ప్రకటన..భారత ఔషధ ఎగుమతులకు దెబ్బ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి