Share News

US Immigration: అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం

ABN , Publish Date - Oct 05 , 2025 | 04:51 PM

ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 50 శాతం మేర తగ్గిపోయింది.

US Immigration: అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల.. దాదాపు సగానికి పడిపోయిన వైనం
Drop In Indian Student Arrivals

ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత చదువుల కోసం అమెరికా యూనివర్సిటీలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది జులై, ఆగస్టుల్లో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే దాదాపు సగం మేర తగ్గింది.

అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ లెక్కల ప్రకారం, ఈ ఆగస్టులో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 41,450. గతేడాది ఆగస్టులో మాత్రం ఏకంగా 74,825 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు. గత ఏడాది జులైలో 24,298 మంది వెళ్లగా ఈ ఏడాది వారి సంఖ్య 13,027కు తగ్గిపోయింది. అంతేకాకుండా, ఓపీటీ ప్రోగ్రామ్ లేని పక్షంలో 54 శాతం మంది విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు వెళ్లరని కూడా సంస్థ అంచనా వేసింది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో సంఖ్యాపరంగా భారతీయులు టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే (Drop in Indian Student arrivals in US).


ఇక ఈ ఏడాది మార్చ్ నుంచి మే మధ్య కాలంలో భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. కోవిడ్ తరువాత ఇంత తక్కువ సంఖ్యలో వీసాలు జారీ కావడం ఇదే తొలిసారి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే అమెరికాకు భారతీయుల రాక తగ్గిపోయింది. వీసా ఇంటర్వ్యూల వాయిదా, సోషల్ మీడియా ప్రొఫైల్స్‌పై నిఘా వంటివన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. అమెరికా యూనిర్సిటీల్లో అడ్మిషన్లు పొందేవారికి మార్చ్-మే నెల మధ్య కాలం అత్యంత కీలకమైనది. ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో అడ్మిషన్లు పొందే విదేశీ విద్యార్థులు మార్చి-మే నెలల్లోనే వీసాలకు సిద్దమవుతారు. అయితే, ఈ కాలంలో వీసాల జారీ ఏకంగా 27 శాతం మేర తగ్గింది.


అమెరికా వలసల శాఖ లెక్కల ప్రకారం, 2024లో అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 27 శాతం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.8 శాతం ఎక్కువ. ఇక గతేడాది ఓపీటీ ఎంచుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 48 శాతం కాగా చైనీయుల వాటా 20.4 శాతం. దీంతో, ఈ రెండు దేశాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

డ్రగ్స్ బోటుపై అమెరికా మిలిటరీ దాడి.. నలుగురు మృతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2025 | 04:58 PM