US Universities: ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న అమెరికా యూనివర్సిటీలు
ABN, Publish Date - Dec 01 , 2025 | 03:06 PM
అమెరికా యూనివర్సిటీల్లో ఈ ఫాల్ సీజన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లు సుమారు 17 శాతం మేర తగ్గాయి. ఫలితంగా వాటి ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మేర కోత పడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఈ ఫాల్ సీజన్‌లో (ఆగస్టు-సెప్టెంబర్) అంతర్జాతీయ విద్యార్థుల రాక భారీగా తగ్గింది. దీంతో, యూనివర్సిటీల ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మేర కోత పడుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి (US Fall Admissions Decline).
అమెరికా విదేశాంగ శాఖ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రకారం, ఈ ఫాల్ సీజన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లు 17 శాతం మేర తగ్గాయి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వీసా విధానాల కారణంగా విదేశీయుల రాక భారీగా తగ్గింది. విధానపరమైన అనిశ్చితి, వీసా ఆంక్షల కారణంగా విదేశీ విద్యార్థులు అనేక మంది అమెరికాకు దూరమవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ విద్యార్థుల ఫాల్ సీజన్ అడ్మిషన్స్‌లో బాగా కోత పడటంతో యూనివర్సిటీలు ఈసారి 1 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇది స్థానిక వ్యాపారాలపై కూడా ప్రభావం చూపనుంది. గత విద్యాసంవత్సరంలో అమెరికాకు విదేశీ విద్యార్థుల ద్వారా 55 బిలియన్ డాలర్ల మేర నిధులు అందాయి. ట్యూషన్ ఫీజులతో పాటు విద్యార్థులు చేసే ఇతరత్రా ఖర్చుల కారణంగా అనేక స్థానిక వ్యాపారాలకు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది మొదట్లో అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 1.2 మిలియన్‌లు. వీరిలో భారతీయులు, చైనీయులే టాప్‌లో ఉండేవారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో వీరి వాటా సుమారు 6 శాతం. అయితే, ఫారిన్ స్టూడెంట్స్ రాక భారీగా తగ్గుతుండటంతో అమెరికా యూనివర్సిటీలపై భారీ ప్రభావం తప్పదని అనేక నివేదికలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి:
నా పార్టనర్ భారత మూలాలున్న వ్యక్తి, నా కొడుకు పేరు శేఖర్: ఎలాన్ మస్క్
అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్
Updated Date - Dec 01 , 2025 | 03:50 PM