H-1b Visa: అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్
ABN , Publish Date - Nov 24 , 2025 | 10:48 PM
అమెరికాకు వెళ్లిన నెల రోజుల్లోపే జాబ్ పోగొట్టుకున్న ఓ భారతీయ యువకుడు తాను చేసిన అతిపెద్ద తప్పు ఒకటుందంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా లభించిందంటేనే వ్యక్తులకు మంచి నైపుణ్యాలు ఉన్నాయని అర్థం. అంతమాత్రాన, హెచ్-1బీ వీసాదారుల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని అర్థం కాదు. ఊహించని సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ పోస్టు రెడిట్‌లో వైరల్‌గా మారింది. ఇటీవలే భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది (H-1b visa Layoffs).
అమెరికాకు వెళ్లిన నెల రోజుల్లోపే తన ఉద్యోగం పోయిందని సదరు యువకుడు తెలిపారు. 2021లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత నుంచీ అదే సంస్థలో కొనసాగుతున్నానని అతడు తెలిపాడు. 2024లో ఓసారి తన హెచ్-1బీ అప్లికేషన్ లాటరీలో ఎంపిక కాకపోవడంతో తాను ఇండియాకు తిరిగిరావాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తరువాత భారత్ నుంచే పని చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అప్రూవల్ లభించడంతో మరోసారి అమెరికాకు వెళ్లానని తెలిపాడు. కానీ అక్కడకు వెళ్లిన నెల రోజుల్లోపే లేఆఫ్స్‌కు గురి కావాల్సి వచ్చిందని అన్నారు. వాస్తవానికి కంపెనీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న వారిలో తాను మొదటి వ్యక్తినని యువకుడు తెలిపారు.
అయితే, లేఆఫ్స్ జరుగుతాయని తాను కొంతకాలంగా ఊహిస్తున్నదే అని చెప్పారు. కానీ మొదటి వేటు తనపైనే పడుతుందని మాత్రం అస్సలు ఊహించలేదని అన్నారు. ఇప్పుడు ఆలోచిస్తుంటే తాను చేసిన అతిపెద్ద పొరపాటు అదేనని అనిపిస్తోందని అన్నారు. తాము కొంత కాలంగా నాన్ బిల్లబుల్ వర్క్ చేస్తున్నప్పుడే తనకు లేఆఫ్స్ భయం మొదలైందని చెప్పారు. అప్పుడే రెండో మరో జాబ్ కోసం వెతకడం ప్రారంభించి ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు.
ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది యువకుడి పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం హెచ్-1బీ వీసాదారులు సాధారణంగా ఇదే పొరపాటు చేస్తుంటారని అన్నారు. లేఆఫ్స్ తమ దాకా రాదని చాలా మంది పొరబడతారని, ఇదే అతి పెద్ద తప్పని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయాన్ని రెడీ చేసుకోవాలని సూచిస్తున్నారు. ముప్పు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేమని వ్యాఖ్యానించారు. దీంతో ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి:
గూగుల్ నానో బనానా ప్రో సామర్థ్యం చూస్తే మతిపోవాల్సిందే..
కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో