Share News

Pak Journalist-Tejas Crash: కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - Nov 22 , 2025 | 03:29 PM

దుబాయ్‌ ఎయిర్‌ షోలో ఓ పాక్ జర్నలిస్టు తన మనసులోని కుళ్లంతా బయటపెట్టుకున్నాడు. తేజస్ జెట్ కూలడం చూసి సంబర పడుతూ వీడియో రికార్డు చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Pak Journalist-Tejas Crash: కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో
Pak Journalist Reaction To Tejas Jet Crash

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ ఎయిర్‌ షోలో శుక్రవారం భారత్‌కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. ఈ ఘటనలో వింగ్ కమాండర్ నమాన్ష్ కూడా మృతి చెందారు. ఈ ఘటనపై అనేక మంది విచారం వ్యక్తం చేశారు. అయితే, ఓ పాక్ జర్నలిస్టు మాత్రం ఈ ఘటన చూసి తెగ మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Pak Journalist Reaction To Tejas Jet Crash).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తేజస్ జెట్ కూలిన వెంటనే ఒక్కసారిగా నల్లటి పొగ వ్యాపించింది. అది చూసిన పాక్ జర్నలిస్టు ఒకరు తెగ సంబరపడ్డాడు. ఆ దృశ్యాన్ని ఫోన్‌లో రికార్డు చేస్తూ జెట్ విమానం కూలిన వైపునకు పరుగులు తీశాడు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అణుచుకోలేని సంబరంతో ఉబ్బితబ్బిపోయాడు. ఇదో బ్రేకింగ్ న్యూస్ అంటూ తన చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. అంతకుముందు రోజే తేజస్ జెట్‌లో ఆయిల్ లీక్‌ను గుర్తించారంటూ అసత్య ప్రచారం ప్రారంభించాడు. ఇది మనవైపున కూలకపోవడంతో బతికిపోయామని అక్కడే ఉన్న మరో వ్యక్తి అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ కలిసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అయితే, ఇవన్నీ అసత్యాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ఆయిల్ లీక్ వంటివేవీ లేవని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది.


ఇక ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు ఆ పాక్ జర్నలిస్టును తెగ తిట్టిపోస్తున్నారు. జర్నలిజం విలువలు కూడా మర్చిపోయి మనసులోని విషాన్ని బయటపెట్టుకున్నాడని అన్నారు. ఒక వ్యక్తి చనిపోయిన సందర్భంలో ఇంతలా సంబరపడటం దారుణమని, అమానవీయమని విమర్శించారు. అవతలివారితో ఎంతటి శత్రుత్వం ఉన్నా నైతికత, కనీస మర్యాదను కోల్పోకూడదని కామెంట్ చేశారు.

పాక్ అగ్రనేతలు కూడా ఇటీవల పలుమార్లు ఉన్మాదంతో రెచ్చిపోయి భారత్‌పై నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. తమ వద్ద కూడా అణు బాంబులు ఉన్నాయంటూ భారత్‌పై రెచ్చిపోయారు. అయితే, జర్నలిజం వంటి బాధ్యతాయుత వృత్తిలో ఉన్న వ్యక్తి కూడా ఇంతగా దిగజారిపోవడంపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవీ చదవండి:

బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ

దాదాపుగా సీలింగ్ ఫ్యాన్స్‌ అన్నిటికీ మూడే బ్లేడ్స్.. ఇలా ఎందుకంటే..

Read Latest and Viral News

Updated Date - Nov 22 , 2025 | 05:31 PM