Share News

Fan-Blade Configuration: దాదాపుగా సీలింగ్ ఫ్యాన్స్‌ అన్నిటికీ మూడే బ్లేడ్స్.. ఇలా ఎందుకంటే..

ABN , Publish Date - Nov 18 , 2025 | 08:34 PM

సాధారణంగా సీలింగ్ ఫ్యాన్స్‌కు మూడు బ్లేడ్స్ మాత్రమే ఎందుకు ఉంటాయి అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? అయితే ఈ కథనం మీకోసమే. అసలు బ్లేడ్ అమరిక వెనకున్న సాంకేతిక కారణాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Fan-Blade Configuration: దాదాపుగా సీలింగ్ ఫ్యాన్స్‌ అన్నిటికీ మూడే బ్లేడ్స్.. ఇలా ఎందుకంటే..
Reasons behind Celing Fans 3 blade Configuration

ఇంటర్నెట్ డెస్క్: అధిక ఉష్ణోగ్రతలు ఉండే భారత్‌లో సీలింగ్ ఫ్యాన్స్ లేకుండా క్షణం కూడా ఉండలేము. అయితే, మన దేశంలో కనిపించే అధిక శాతం ఫ్యాన్స్‌కు మూడు రెక్కలు (బ్లేడ్స్) మాత్రమే ఉంటాయి. మరి ఇలా ఎందుకు? నాలుగు బ్లేడ్స్ ఉంటే ఏమవుతుంది? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? అయితే ఈ కథనం మీకోసమే (Why most Celing Fans Have 3 Blades).

నిపుణులు చెప్పేదాని ప్రకారం, అతి తక్కువ విద్యుత్ వినియోగంతో అత్యధిక ప్రయోజనం పొందాలంటే ఫ్యాన్‌కు మూడు రెక్కలు ఉండటమే బెటర్. బ్లేడ్స్ తక్కువగా ఉంటే ఫ్యాన్ తిరిగేటప్పుడు గాలి వల్ల ఎదురయ్యే నిరోధం తక్కువగా ఉంటుంది. దీంతో, ఫ్యాన్ మరింత సమర్థవంతంగా గాలిని గదిలోని అన్ని మూలలకు నెట్టగలుగుతుంది. మరింత వేగంగా ఫ్యాను తిరగగలుగుతుంది. బ్లేడ్‌ల సంఖ్య పెరిగే కొద్దీ మోటార్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఫ్యాన్ వేగం తగ్గుతుంది. ఇలా జరగకూడదంటే మరింత శక్తిమంతమైన మోటార్ ఫ్యాన్‌లో అమర్చాల్సి ఉంటుంది. ఫలితంగా ఫ్యాను ధరలు పెరుగుతాయి. విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో అధిగమవుతుంది. నిరంతరం అధిగ ఉష్ణోగ్రతలు ఉండే భారత్‌లో మూడు కంటే ఎక్కువ బ్లేడ్స్ ఉన్న ఫ్యాన్స్ వల్ల వినియోగదారులపై భారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు (Efficiency Fan 3 Blade Configuration).


మరి మూడు కంటే ఎక్కువ బ్లేడ్స్ ఉన్న ఫ్యాన్స్ లేవా అంటే ఉన్నాయి. నాలుగు, ఐదు బ్లేడ్స్ ఉన్న ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. అయితే, ఆకర్షణీయంగా ఉండేందుకు కొన్ని వాణిజ్య సముదాయాల్లో ఇలాంటి ఫ్యాన్స్ వినియోగిస్తుంటారు. కొన్ని ప్రీమియమ్ ఫ్యాన్స్‌కు కూడా 3 కంటే ఎక్కువ బ్లేడ్స్ ఉంటాయి. అయితే, సామాన్యులకు అందుబాటు ధరల్లో సమర్థవంతంగా పనిచేసే ఫ్యాన్‌కు మూడు బ్లేడ్స్ మాత్రమే ఉండాలని నిపుణులు స్పష్టం చేశారు. అయితే, ఫ్యాన్ సమర్థవంతంగా పనిచేయాలంటే బ్లేడ్స్ సంఖ్యతో పాటు అవి ఏ మేరకు వంపుతో ఫ్యాన్‌కు అమర్చారనే విషయం కూడా కీలకమేనని నిపుణులు చెబుతున్నారు. సో.. అదన్నమాట ఫ్యాన్‌కు మూడు బ్లేడ్స్ అమర్చడానికి వెనుకున్న సీక్రెట్!


ఇవీ చదవండి:

ఇంటి నిర్వహణ కోసం ప్రత్యేక మేనేజర్.. నెలకు జీతం ఎంతో తెలిస్తే..

దొంగ మనసు మార్చిన చిన్నారి.. చూసి తీరాల్సిన వీడియో!

Read Latest and Viral News

Updated Date - Nov 18 , 2025 | 08:44 PM