Home Manager: ఇంటి నిర్వహణ కోసం ప్రత్యేక మేనేజర్.. నెలకు జీతం ఎంతో తెలిస్తే..
ABN , Publish Date - Nov 17 , 2025 | 08:38 PM
ఇంటి విషయాలను చక్కబెట్టేందుకు హోమ్ మేనేజర్‌ను నియమించుకున్నామంటూ ఓ ఏఐ సంస్థ అధిపతి నెట్టింట పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పోస్టుపై అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు తమ మనసులోని సందేహాలను ఆ సంస్థ అధిపతి ముందుంచారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు తమ సొంత సంస్థలను నిర్వహిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇలాంటి వారికి ఇంటి బాధ్యతలు వల్ల అదనపు భారం ఎంతగా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అనేక మంది ఇంటి పనుల కోసం సహాయకులను పెట్టుకుంటారు. అయితే, గ్రేల్యాబ్స్ ఏఐ సంస్థ వ్యవస్థాపకుడు అమన్ గోయల్ ఇంటి విషయాల్లో సహాయం కోసం హోమ్ మేనేజర్‌ను నియమించుకున్నామని చెప్పడంతో నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది (Home Manager - Household Chores).
అమన్, ఆయన భార్య హర్షిత ఇద్దరూ ఐఐటీలో చదువుకున్నారు. తమ సంస్థ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్న వారికి ఇంటి విషయాలు పట్టించుకునేందుకు క్షణం తీరిక కూడా దొరకడం లేదు. దీంతో, వారు హోమ్ మేనేజర్ సహాయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అమన్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘ఇంటి మెయింటెనెన్స్ సమస్యలు, పచారీ సామాన్లు, లాండ్రీ, ఆ రోజు చేయాల్సిన వంటలు, వంటివన్నీ హోమ్ మేనేజర్ చూసుకుంటున్నారు. దీంతో, మాకు బోలెడంత సమయం ఆదా అవుతోంది. ఇప్పటివరకూ మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇది మంచి నిర్ణయమే అని అనుకుంటున్నా. కెరీర్‌లో బిజీగా ఉండే మాలాంటి వారికి ఇంటి విషయాలపై దృష్టి పెట్టేంత సమయం ఉండదు. మా హోమ్ మేనేజర్ విద్యావంతురాలు, ఓ హోటల్‌లో ఆపరేషన్స్ విభాగం అధిపతిగా కూడా పని చేశారు. మేము నెలకు రూ.లక్ష జీతం ఇస్తున్నాము. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నదే. కానీ మా విలువైన సమయం ఆదా అవుతోంది. ఇంత చెల్లించే స్తోమత మాకు కూడా ఉంది’ అని అన్నారు. తన వ్యక్తిగత డబ్బు నుంచే జీతం చెల్లిస్తున్నట్టు తెలిపారు.
ఈ పోస్టు ఆసక్తికరంగా ఉండటంతో అనేక మంది స్పందించారు. హోమ్ మేనేజర్లను ఎలా ఎంపిక చేశారు? వారు ఉద్యోగం మానేస్తే అప్పుడేం చేస్తారు? చెప్పకుండా సెలవులు పెడితే ఏం చర్యలు తీసుకుంటారు? అంటూ తమకు తోచిన ప్రశ్నలు వేశారు. ఈ పనులను కూడా ఏఐకి అప్పగిస్తే పోలా అని మరికొందరు సెటైర్లు పేల్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
దొంగ మనసు మార్చిన చిన్నారి.. చూసి తీరాల్సిన వీడియో!
వామ్మో.. ఎలాన్ మస్క్ ట్రోల్ చేస్తే దిమ్మతిరగాల్సిందే.. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓకు షాక్