Techie Success Story: బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ
ABN , Publish Date - Nov 20 , 2025 | 03:14 PM
బీటెక్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కూడా అర్హత సాధించలేని యువకుడు ఐదేళ్లు తిరిగేసరికల్లా ఏకంగా రూ.1.7 కోట్ల శాలరీ సంపాదించే స్థితికి ఎదిగాడు. అతడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ యువకుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బీటెక్‌లో అతడికి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 17 బ్యాక్‌లాగ్స్! ఎలాగొలా వాటి నుంచి బయటపడ్డా క్యాంపస్ ఇంటర్వ్యూలకు అతడిని రావొద్దని కాలేజీ వాళ్లు తేల్చిచెప్పారు. ఈ స్థితికి దిగజారిని కెరీర్‌ను చక్కదిద్దుకోవడం దాదాపుగా అసాధ్యం. కానీ మనోడి పట్టుదల ముందు ఈ ప్రతికూలతలు ఏవీ నిలవలేకపోయాయి. దీంతో, అతడు ఐదేళ్లు తిరిగే సరికి ఏటా రూ.1.78 కోట్ల శాలరీ సంపాదించే స్థాయికి ఎదిగాడు. తన జీవిత విశేషాలను స్వయంగా ఆ యువకుడు నెట్టింట పంచుకున్నాడు (Techie's Success Story)
రెడిట్‌లోని ఇండియా ఫ్లెక్స్ ఫోరమ్‌లో సదరు వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. యువకుడిది సాధారణ నేపథ్యం. టైర్-3 నగరంలోని ఓ సామాన్య ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ చేశాడు. బీటెక్‌లో ఏకంగా 17 బ్యాక్‌లాగ్స్. చివరి సంవత్సరానికి వాటి నుంచి ఎలాగొలా బయటపడ్డాడు. కానీ ఇన్ని బ్యాక్‌లాగ్స్ కారణంగా క్యాంపస్ ఇంటర్వ్యూలకు అర్హత సాధించలేకపోయాడు. దీంతో, సొంతంగానే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు (17 Backlogs in BTech to Rs 1.7cr Salary).
ఓ చిన్న సర్వీస్ బేస్డ్ స్టారప్ట్ కంపెనీలో అతడికి తొలి ఉద్యోగం వచ్చింది. 2020-22 మధ్య అతడు అక్కడ ఏటా రూ.3.2 లక్షల శాలరీతో పనిచేశాడు. వారాంతాలు, సెలవుల విషయమే మర్చిపోయాడు. పట్టుదలే శ్వాసగా, పనే లోకంగా బతికాడు. కంప్యూటర్ సైన్స్ అంటే మొదటి నుంచీ అతడికి ఆసక్తి. దీంతో వెబ్, మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్ డెవలప్‌మెంట్‌పై పట్టుసాధించాడు. ఫుల్ స్టాక్ డెవలపర్‌గా ఎదిగాడు. ఆ తరువాత విదేశాల్లో కెరీర్ నిర్మించుకునేందుకు నడుం కట్టాడు.
2022లో మాస్టర్స్ డిగ్రీ కోసం యూఎస్ వెళ్లాడు. భారంగా మారిన ఎడ్యుకేషన్ లోన్‌ను తీర్చేందుకు పార్ట్‌టైమ్ జాబ్స్ చేశాడు. గ్రాడ్యుయేషన్ తరువాత కూడా ఏ ఆఫర్ రాలేదు. అయినా మనోడు వెనక్కు తగ్గలేదు. ఫ్రీలాన్సింగ్‌కు పూనుకున్నాడు. తనకు వచ్చిన ప్రతి ప్రాజెక్టును నిర్వహించాడు. అదే సమయంలో వై కాంబినేటర్ ఫౌండర్స్, టెక్ రంగ నిపుణులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ నెట్‌వర్కింగ్ కారణంగా సిలికాన్ వ్యాలీలో ఓ సంస్థలో కాంట్రాక్ట్ జాబ్ లభించింది. కానీ ఆ ఆనందం కొన్ని నెలలకే ఆవిరైపోయింది. లేఆఫ్స్‌కు గురి కావడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది.
కానీ యువకుడు మాత్రం నిరాశను దరిచేరనివ్వలేదు. పట్టుదలను కోల్పోలేదు. మునుపటి కంటే రెండింతలు శ్రమించాడు. చివరకు అతడి కఠోర శ్రమ ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. మరో సంస్థలో ఈసారి ఏకంగా రూ.1.7 కోట్ల (మన కరెన్సీలో) ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. ఐఐటీల్లో చదివిన వారికే సాధ్యమయ్యే కెరీర్‌గ్రాఫ్‌ను సామాన్య నేపథ్యం కలిగిన ఈ యువకుడు సొంతం చేసుకున్న వైనంపై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇవీ చదవండి:
దాదాపుగా సీలింగ్ ఫ్యాన్స్ అన్నిటికీ మూడే బ్లేడ్స్.. ఇలా ఎందుకంటే..
ఇంటి నిర్వహణ కోసం ప్రత్యేక మేనేజర్.. నెలకు జీతం ఎంతో తెలిస్తే..