Google Nano Banana: గూగుల్ నానో బనానా ప్రో సామర్థ్యం చూస్తే మతిపోవాల్సిందే..
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:36 PM
ఓ గణిత సమస్యను పరిష్కరించడంతో పాటు సొల్యూషన్‌ను చేతి రాతతో రాసినట్టు ఓ చిత్రాన్ని నానో బనానా ప్రో ఇచ్చిన వైనం ప్రస్తుతం నెట్టింట కలకలానికి దారి తీసింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నారు. ఈ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ నానో బనానో ప్రో ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోంది. అద్భుతమైన చిత్రాలను క్షణాల్లో వేసిస్తున్న ఈ టెక్నాలజీకి జనాలు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో బనానా ప్రో సామర్థ్యం ఎంతటిదో కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది (Google Nano Banana Pro).
గణిత సమస్యను గూగుల్ బనానా ప్రో ఎలా పరిష్కరించిందీ చెబుతూ ఓ వ్యక్తి నెట్టింట ఫొటోతో సహా పోస్టు పెట్టారు. మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఒకటి పుస్తకంపై రాసి ఫొటో తీసి నానో బనానా ప్రోకు ఇస్తే అది దానికి సమాధానం కనుగొనడమే కాకుండా పుస్తకంపై చేత్తో సొల్యూషన్‌ను రాసినట్టు అనిపించేలా చిత్రాన్ని కూడా ఇచ్చిందని అన్నారు. ఈ సాంకేతికతతో విద్యార్థులు పండుగ చేసుకుంటారని అతడు కామెంట్ చేశారు (Math Problem Solved).
ఈ పోస్టుకు జనాల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. అయితే, అధిక శాతం ఏఐ టాలెంట్‌కు ఆశ్చర్యపోయే బదులు పెదవి విరిచారు. ఇది దుర్వినియోగం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థనే సమూలంగా మార్చి వేసే శక్తి ఈ సాంకేతికతకు ఉందని అన్నారు. ‘ఇలాగైతే విద్యార్థులు తరగతి గదుల్లో ఏమీ నేర్చుకోరు. తమ హోమ్ వర్క్ మొత్తాన్ని ఏఐకి అప్పగిస్తారు. చివరకు వారి తెలివితేటలకు పదును పెట్టే అవకాశమే ఉండదు’ అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ‘గణిత సమస్యను పరిష్కరించడమే కాకుండా మొదటి ఫొటోలోని దస్తూరిని పోలీనట్టు సొల్యూషన్‌ను రాసి చిత్రం రూపంలో ఇవ్వడం మామూలు విషయం కాదు. ఏఐ జమానా తొలి నాళ్లల్లోనే టెక్నాలజీ ఇంతగా ఎదిగిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది’ అని మరొక వ్యక్తి అన్నారు. కొందరు మాత్రం ఈ పోస్టుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇది నిజమై ఉండకపోవచ్చని అన్నారు.
ఇటీవల విడుదలైన గూగుల్ జెమినీ 3 సిరీస్‌లో భాగంగా నానో బనానా ప్రో జనాల ముందుకొచ్చింది. మరించ కచ్చితమైన ఇమేజీలు, తార్కిక శక్తి దీని సొంతమని గూగుల్ చెబుతోంది. అందుబాటులో ఉన్న తాజా సమాచారం ఆధారంగా ఇది పని చేస్తుందని పేర్కొంది.
ఇవీ చదవండి:
కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ