US Sanctions on Ind: చైనాను వదిలిపెట్టి భారత్‌పై సుంకాలు.. ఇలా ఎందుకో చెప్పిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి
ABN, Publish Date - Aug 18 , 2025 | 11:04 AM
రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనాను వదిలిపెట్టి భారత్‌పై సుంకాల వడ్డనకు కారణాలను అమెరికా విదేశాంగ శాఖ మంత్రి తాజాగా వివరించారు. రష్యా చమురులో అధిక శాతాన్ని చైనా శుద్ధి చేసి మళ్లీ ఎగుమతి చేస్తోందని, ఈ దశలో సుంకాలు విధిస్తే మార్కెట్‌లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనాను ఉపేక్షించి భారత్‌పై సుంకాలు విధించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా వివరణ ఇచ్చారు. చైనాపై అదనపు సుంకాలు విధిస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయని అన్నారు.
రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురులో అధిక శాతాన్ని చైనా శుద్ధి చేసి ఇతర దేశాలకు విక్రయిస్తోందని మార్కో రూబియో తెలిపారు. ఈ దశలో చైనాపై సుంకాలు విధిస్తే మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ‘రష్యా నుంచి చైనా కొనుగోలు చేస్తున్న చమురులో అధిక శాతం ఐరోపా దేశాలు కొంటున్నాయి. ఇది కాకుండా సహజవాయువును కూడా కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం అవి దిగుమతులను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అయితే, ఈ విషయంలో ఐరోపా చేయాల్సింది ఏంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తే బయ్యర్లు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది రేట్లను పెంచుతుంది’ అని చెప్పుకొచ్చారు. చైనా, భారత్‌పై ఆంక్షల విధింపు కోసం సెనేట్ బిల్లు రూపకల్పన సమయంలో ఐరోపా దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయని అన్నారు.
రష్యా చమురు, సహజ వాయువును కొంటున్న ఐరోపా దేశాలపై ఆంక్షలు విధిస్తారా అన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిచ్చారు. ఈ విషయంలో ప్రస్తుతం తన వద్ద సమాచారం లేకపోయినప్పటికీ రెండో దశ ఆంక్షల ప్రభావాలు కచ్చితంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఈ విషయంలో ఐరోపా దేశాలపై ప్రతీకార చర్యలకు దిగే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంలో ఐరోపా దేశాలు నిర్మాణాత్మక పాత్ర పోషించగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
భారత్‌పై ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకం విధిస్తామని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో తెర వెనక చర్చలు జరుగుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే, ఆగస్టు 25న ఇరు దేశాల మధ్య జరగాల్సిన ఆరవ విడత చర్చలు వాయిదా పడ్డట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. దీంతో, భారత్‌పై 50 సుంకం విధింపు తప్పదేమోనన్న అంచనాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
నేడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశం.. ఐరోపా దేశాల నేతలూ హాజరు
అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 18 , 2025 | 11:15 AM