Trump- Zelenskyy: నేడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశం.. ఐరోపా దేశాల నేతలూ హాజరు
ABN , Publish Date - Aug 18 , 2025 | 07:47 AM
రష్యాతో యుద్ధం ముగింపు దిశగా మరో అడుగు పడింది. నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌లో జెలెన్‌స్కీకి మద్దతుగా పలువురు ఐరోపా నేతలు కూడా పాల్గొంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాషింగ్టన్ డీసీలో సమావేశం కానున్నారు. రష్యాతో యుద్ధం ముగింపుపై చర్చించనున్నారు. ఈ చర్చల్లో ఐరోపా దేశాలు నేతలూ పాల్గొంటారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా వాన్ డర్ లేయన్, ఫిన్‌ల్యాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనీ తదితరులు ఈ సమావేశంలో జెలెన్‌స్కీకి మద్దతుగా పాల్గొంటారు.
కాగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచేందుకు ఆదివారం పలు యూరోప్ దేశాలు సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో పాటు ఇతర దేశాలు నేతలు పాల్గొన్నారు. రష్యాతో ఒప్పందంలో ఉక్రెయిన్‌కు గరిష్ట ప్రయోజనం కలగాలని, భద్రతా హామీలు దక్కేలా ప్రయత్నించాలని తీర్మానించారు. ఉక్రెయిన్ భూభాగంపై చర్చ జరగాలని కూడా అన్నారు. మిగిలిన ప్రాంతాల రక్షణకు రష్యా నుంచి గట్టి హామీలు ఉండాలని నిర్ణయించారు. శాంతి చర్చల కోసం అమెరికా తీసుకుంటున్న చర్యలను కూడా ప్రశంసించారు. మీటింగ్ అనంతరం ఈ మేరకు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఓ సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశాయి.
ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్‌తో పేర్కొన్నట్టు ఆయన ప్రతినిధి స్టవ్ విట్కాఫ్ ఇటీవల తెలిపారు. యుద్ధం ముగింపు దిశగా ఇది మేలి మలుపు అని వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందానికి తాము సిద్ధమే అయినా తమకూ రక్షణ హామీలు దక్కాలని రష్యా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ తన భూభాగంలో కొంత కోల్పోయేందుకు సిద్ధంగా ఉండాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
పాక్‌లో ప్రకృతి విలయం.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. అధికారుల్లో ఆందోళన
అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి