Pak Flash Floods: పాక్‌లో ప్రకృతి విలయం.. వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. అధికారుల్లో ఆందోళన
ABN , Publish Date - Aug 18 , 2025 | 07:16 AM
పాక్‌లోని ఖైబర్ పాఖ్‌తున్‌ఖ్వా ప్రావిన్స్ ఆకస్మిక వర్షాలు, వరదలకు అల్లాడుతోంది. మృతుల సంఖ్య 1000కి పైగానే ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఊహకందని స్థాయిలో విధ్వంసం జరిగిందని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి ప్రకోపానికి పాక్ అల్లాడుతోంది. ఖైబర్‌ఫాఖ్‌తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో బీభత్సమైన వర్షాలు, వరదల కారణంగా వందల మంది మరణించారు. మృతుల సంఖ్య 1000కి పైగానే ఉండొచ్చని ఉన్నత స్థాయి అధికారి ఇఖ్తియార్ వలీ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముంపునకు గురైన ప్రాంతాలను తాను స్వయంగా సందర్శించానని ఆయన తెలిపారు. అనేక గ్రామాలు వరదల్లో తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బునర్ జిల్లా ఛర్గాజీ గ్రామంలో ఊహకు అందని స్థాయిలో విధ్వంసం సంభవించిందని చెప్పారు. బాషోనీ అనే గ్రామం అనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు.
భారీ ట్రక్కులంత సైజులో ఉన్న రాళ్లు వరదల కారణంగా జనావాసాల వైపు దూసుకొచ్చాయని చెప్పారు. ఈ వరదల బారిన పడ్డ కొన్ని కుటుంబాలు ఏమైపోయాయో కూడా తెలియట్లేదని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం, మృతుల సంఖ్య 300గా ఉన్నప్పటికీ అనేక కేసుల గురించి రికార్డుల్లోకే ఎక్కలేదని తెలిపారు. ఈ వర్షాలు, వరదలు అత్యంత వినాశకర ప్రకృతి విపత్తులని పేర్కొన్నారు. ఒక్క దిర్ ప్రాంతంలోనే మరణాల సంఖ్య వెయ్యి దాటే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేశారు. మృత దేహాల సామూహిక ఖననాలు జరుగుతున్నట్టు కూడా చెప్పారు. అక్కడ ఉండే సుమారు 1000 మంది స్థానికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని అన్నారు. ‘బునర్ నుంచి ఇప్పుడే తిరిగొచ్చా. ఆ భయానక దృశ్యాలను స్వయంగా చూశా’ అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పాక్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం, వర్షాలు, వరదల కారణంగా జూన్ 26 నుంచి ఇప్పటివరకూ అక్కడ 657 మంది మృతి చెందారు. మృతుల్లో 392 మంది పురుషులు ఉన్నారు. మరో 939 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో 437 మంది పురుషులు, 256 మంది చిన్నారులు, 236 మంది మహిళలు ఉన్నారు. స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నామని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..
న్యూయార్క్ రెస్టారెంట్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి