NY Restaurant Shooting: న్యూయార్క్ రెస్టారెంట్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:54 PM
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. 8 మంది గాయపడ్డారు. ఈ దారుణానికి పాల్పడినది ఎవరో ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి నిత్యం అమాయకులు బలవుతూనే ఉన్నారు. తాజాగా న్యూయార్క్ నగరంలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి రెస్టారెంట్‌లో ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 8 మంది గాయాలపాలయ్యారు. బ్రూక్లిన్ బరో ప్రాంతంలోని క్రౌన్ హైట్స్‌లోగల టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్‌లో ఈ దారుణం జరిగింది.
ఈ ఉదంతంపై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ జెసికా టీష్ మీడియాతో మాట్లాడారు. మృతులు అందరూ పురుషులేనని తెలిపారు. వారిలో ఇద్దరి వయసు 35 ఏళ్లు, 27 ఏళ్లు అని తెలిపారు. మూడో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని కూడా తెలిపారు. కాల్పులకు దిగింది ఎవరో ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పారు.
ఇక ఘటనా స్థలంలో నుంచి తూటాలకు సంబంధించి 36 కేసింగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఘటనలో గాయపడ్డ 8 మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. వీరెవరికీ ప్రాణాపాయం లేదని అన్నారు. మరోవైపు, నిందితులను గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షూటర్‌ల గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
ట్రంప్‌తో చర్చలు.. రష్యన్‌లోనే మాట్లాడిన పుతిన్.. ఆయనకు అసలెన్ని భాషలు వచ్చంటే..
యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమే.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి