Donald Trump: సుంకాల సంకెళ్లు తప్పినట్టే!
ABN, Publish Date - Aug 17 , 2025 | 05:40 AM
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయా? యుద్ధానికి మూల కారణాల్లో ఒకటైన భూభాగాల అప్పగింత ఓ కొలిక్కి వస్తుందా? అలాస్కాలో చర్చలు సఫలమయ్యాయని ట్రంప్, పుతిన్ ఇద్దరూ గట్టిగా చెప్పడం
ట్రంప్, పుతిన్ భేటీ నేపథ్యంలో భారత్‌కు ఉపశమనం
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేత దిశగా పరిణామాలు
25% అదనపు సుంకాల అమలు నిలిచిపోయే అవకాశం!
రెండో విడత సుంకాలు ప్రస్తుతానికి అవసరం లేదు
పుతిన్‌తో భేటీ సానుకూలం.. భూభాగాల అప్పగింతపై చర్చ
శాంతి ఒప్పందానికి జెలెన్‌స్కీ ముందుకు రావాలి: ట్రంప్
మా భద్రతకు అమెరికా, యూరప్ హామీ ఇవ్వాలి: జెలెన్‌స్కీ
రేపు వాషింగ్టన్‌లో ట్రంప్, జెలెన్‌స్కీ చర్చలు
కొన్ని భూభాగాల్ని రష్యాకు అప్పగించడమే పరిష్కారం!
తొలి నుంచి పుతిన్ డిమాండ్ ఇదే.. ఆ దిశగానే సంధి!
వాషింగ్టన్, న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయా? యుద్ధానికి మూల కారణాల్లో ఒకటైన భూభాగాల అప్పగింత ఓ కొలిక్కి వస్తుందా? అలాస్కాలో చర్చలు సఫలమయ్యాయని ట్రంప్, పుతిన్ ఇద్దరూ గట్టిగా చెప్పడం, ఇక అంతా ఉక్రెయిన్, యూరప్ దేశాల చేతిలోనే ఉందని ట్రంప్ ప్రకటించడం ఇందుకు సంకేతమేనా? యుద్ధం ముగింపునకు వస్తే రష్యాపై ఆంక్షలు తొలగుతాయా? ఆ ఆంక్షల వల్ల అమెరికా సుంకాల మోతబారినపడిన భారత్‌కు ఉపశమనం లభిస్తుందా?.. ఈ ప్రశ్నలన్నింటికీ. ట్రంప్, పుతిన్ భేటీ తర్వాతి పరిణామాలు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. రష్యాతోపాటు భారత్‌పై ఆంక్షలు, సుంకాలు పెంచుతానంటూ హూంకరించిన ట్రంప్.. ప్రస్తుతానికి అవేమీ లేనట్టేనని చెప్పడం కూడా మంచి పరిణామమని భారత వర్గాలు చెబుతున్నాయి. అయితే భూభాగాల అప్పగింతకు జెలెన్‌స్కీ నిరాకరిస్తుండటం, ఇన్నాళ్లూ ఉక్రెయిన్ అంశంలో కీలకంగా వ్యవహరించిన యూరోపియన్ దేశాలు చర్చల్లో తమను భాగస్వామ్యం చేయలేదన్న కినుకతో ఉండటం వంటివి ఇబ్బందిగా మారాయి. ఏదేమైనా సోమవారం అమెరికాలో జరిగే ట్రంప్, జెలెన్‌స్కీ భేటీ తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడిక జెలెన్‌స్కీ చేతిలో ఉంది: ట్రంప్
పుతిన్‌తో భేటీ అనంతరం ఎయిర్‌ఫోర్స్ విమానంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘పుతిన్‌తో భేటీ చాలా బాగా జరిగింది. రెండో విడత సుంకాల విధింపు ప్రస్తావన ప్రస్తుతానికి అవసరం లేదనుకుంటున్నాను. రెండు, మూడు వారాల్లోనో, ఆ తర్వాతనో దీనిపై ఆలోచిస్తా. ఒకవేళ ఇప్పుడే విధిస్తే అది వాళ్ల (రష్యా, మిత్రదేశాల)కు తీవ్రమైన దెబ్బ’’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు నిలిపివేస్తోంటూ.. రష్యా ఒక పెద్ద చమురు కొనుగోలుదారును కోల్పోయిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక పుతిన్‌తో సుమారు 3గంటల పాటు చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేస్తూ.. యుద్ధ విరమణ అంశం ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్ దేశాల చేతిలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు. త్వరగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. రష్యా బలమైన దేశమని, ఉక్రెయిన్ కాదని వాఖ్యానించారు ఇరుదేశాల్లో బందీలుగా ఉన్న వేలాది మంది యుద్ధ ఖైదీలు త్వరలోనే విడుదలవుతారని చెప్పారు.
రేపు ట్రంప్, జెలెన్‌స్కీ భేటీ
పుతిన్‌తో ట్రంప్ భేటీ, యుద్ధం నిలిపివేతపై చర్చల నేపథ్యంలో సోమవారం అమెరికాలోని వాషింగ్టన్‌లో ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీకానున్నారు. పుతిన్‌తో భేటీ అయి వాషింగ్టన్‌కు తిరిగి వెళ్తున్న ట్రంప్‌తో గంటన్నర పాటు ఫోన్‌లో మాట్లాడానని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ భద్రత కోసం శాంతి చర్చల ప్రక్రియలతో అమెరికాతోపాటు యూరప్ దేశాల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే భూభాగాల అప్పగింత కోసం పుతిన్ డిమాండ్ చేసినట్లు జెలెన్‌స్కీకి ట్రంప్ వివరించారని.. దీనికి జెలెన్‌స్కీ నిరాకరించారని కీవ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు జెలెన్‌స్కీతో చర్చల్లో సానుకూలత వస్తే.. త్వరలో పుతిన్‌తో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
యుద్ధం త్వరగా ముగియాలి: భారత్
ట్రంప్, పుతిన్ చర్చలను భారత్ స్వాగతించింది. ‘‘శాంతి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. దౌత్యం, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలని ప్రపంచం కోరుకుంటోంది’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
20% భూభాగాల అప్పగింతే.. శాంతి?
ఉక్రెయిన్ అంశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌దే పైచేయి అవుతోంది. రష్యా చేస్తున్న డిమాండ్లకు అనుగుణంగానే యుద్ధ విరమణ, శాంతి ఒప్పందం దిశగా పరిణామాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న ఖేర్సన్, జపొరిజియా, డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలు, క్రిమియా ద్వీపకల్పం తమవేనని రష్యా ఎప్పటినుంచో వాదిస్తోంది. ఈ ప్రాంతాలను తమకు అప్పగించాలని కోరుతోంది. దానికితోడు రష్యాకు శత్రుదేశాల కూటమి అయిన నాటోలో ఉక్రెయిన్ చేరడానికి ప్రయత్నించడమూ పుతిన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధానికి ‘మూల కారణాలు’ ఇవేనని, అవి పరిష్కారమైతే యుద్ధం ప్రసక్తే ఉండదని ప్రకటించారు. రష్యా కోరుతున్న ప్రాంతాలు ఉక్రెయిన్ మొత్తం భూభాగంలో 20శాతం మేర ఉంటాయి. ఇందులో క్రిమియా ద్వీపకల్పాన్ని, డోనెట్స్క్‌లో చాలా భాగాన్ని 2014లోనే రష్యా ఆక్రమించింది. తాజాగా యుద్ధంలో మొత్తం లుహాన్స్క్‌తోపాటు ఖేర్సన్, జపొరిజియా రీజియన్లలో చాలా భాగం రష్యా ఆధీనంలోకి వెళ్లాయి. అయితే వీటిని అధికారికంగా, శాశ్వతంగా అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. ఇక శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి ఉంటుందని ట్రంప్ వారం రోజుల క్రితమే చెప్పారు. పుతిన్‌తో భేటీ తర్వాత కూడా.. భూభాగాల అప్పగింత కోసం రష్యా డిమాండ్ చేస్తోందని, ఇప్పుడంతా జెలెన్‌స్కీ చేతిలోనే ఉందని ట్రంప్ స్పష్టంగా వెల్లడించారు. ఈ క్రమంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు వచ్చినట్టేని.. భారత్‌కు ఉపశమనమేనని భారత అధికారులు చెబుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే భారత్‌పై అమెరికా అడ్డగోలు సుంకాలు విధించిందని గుర్తు చేస్తున్నారు. యుద్ధం సద్దుమణిగితే.. రష్యాతోపాటు భారత్‌పైనా ఆంక్షలు, సుంకాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. భారత్‌పై విధించిన 25శాతం అదనపు సుంకం అమల్లోకి వచ్చే ఆగస్టు 27వ తేదీనాటికి అంతా కొలిక్కి రావొచ్చని... ఈ అదనపు సుంకాలను తొలగించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్‌కు చైనా మంత్రి.. ఎందుకంటే..
రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 17 , 2025 | 05:40 AM