US Visa Rules: అమెరికా విద్యార్థి వీసా గడువు నాలుగేళ్లే
ABN, Publish Date - Aug 29 , 2025 | 03:02 AM
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది....
జర్నలిస్టులకు 240 రోజుల పరిమితి
ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు
అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థకు దెబ్బ: నిపుణులు
న్యూఢిల్లీ, ఆగస్టు 28: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది. అంతర్జాతీయ విద్యార్థులతో పాటు ఎక్స్చేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధుల వీసాలకు పరిమిత కాల గడువు విధించేందు కు బుధవారం నూతన నిబంధనలను ప్రతిపాదించింది. దీనిప్రకారం విద్యార్థి, ఎక్స్చేంజ్ వీసాలను నాలుగేళ్లకు పరిమితం చేస్తారు. విదేశీ మీడియా ప్రతినిధులకు ఇచ్చే ఐ-వీసాలను 240 రోజులకు జారీ చేస్తారు. జర్నలిస్టు వీసాపై ఉన్న చైనీయులకు 90 రోజుల పరిమితిని కఠినంగా అమలు చేయనున్నారు. ఈ గడువును మించి నివాసం ఉండాలనుకునేవారు అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవల (యూఎ్‌ససీఐఎస్) విభాగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా వారి దరఖాస్తులను సమీక్షించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎ్‌స)కు తగినంత వెసులుబాటు లభిస్తుంద ని భావిస్తున్నారు. తాజాప్రతిపాదనలు అమలులోకి వస్తే 1978 నుంచి అమలులో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానం స్థానంలో పరిమిత కాల నివాస అనుమతులతో కూడిన వీసా మంజూరు చేస్తారు. ప్రస్తుతం ఎఫ్-1, జే-1 వీసాదారులు తమ కోర్సు మొత్తం పూర్తయ్యే వరకూ అమెరికాలో నివసించే అవకాశం ఉంది. కొంతమంది ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తూ శాశ్వత విద్యార్థులుగా మారిపోతున్నారని, ఎప్పటికప్పుడు తమ నివాస అనుమతులను పొడిగించుకుంటున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీసా గడువును పరిమితం చేయాలని డీహెచ్‌ఎస్ ఇటీవల ప్రతిపాదించింది. కొత్త ప్రతిపాదనలతో కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నామని, ఇది వీసా దుర్వినియోగానికి చెక్ పెడుతుందని డీహెచ్‌ఎస్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కొత్త ప్రతిపాదనలపై 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కాగా, ఈ ప్రతిపాదనలు అమెరికా ఉన్నత విద్యావ్యవస్థను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకా రం 2024లో దాదాపు 16లక్షల మంది ఎఫ్-వీసా విద్యార్థులతో పాటు 3,55,000మంది ఎక్స్చేంజీ విజిటర్లు, 13వేల మంది విదేశీమీడియా ప్రతినిధులు అమెరికాలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..
Updated Date - Aug 29 , 2025 | 03:02 AM