Mangalore Bus Crash: బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 07:22 PM
కేఎస్ఆర్టీసీ రోడ్డు సమీపంలోని తలపాడి టోల్ గేట్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
కర్ణాటక: మంగళూరులో ఇవాళ(గురువారం) ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి బస్టాండ్ వద్ద వేచి ఉన్న వారిపైకి దూసుకెళ్లింది(Mangalore Bus Crash). ఈ ఘటనలో బస్సు ఒక ఆటోను ఢీకొట్టగా.. అది పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఆ క్రమంలో ఆటో డ్రైవర్‌తో సహా మొత్తం ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతిచెందిన వారిలో..
మరణించిన వారిలో హైదర్ (47), ఖదీజా (60), హస్నా (11), నఫీసా (52), ఐషా ఫిదా (19), ఫరంగిపేట నివాసి అవ్వమ్మ (72) ఉన్నారు. గాయపడిన వారిలో కాసర్గోడ్ నివాసితులైన లక్ష్మి (61), సురేంద్ర (39) ఉన్నారు. ఈ ఇద్దరూ తీవ్రగాయాలతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో మరికొంతమంది వివరాలు తెలియాల్సి ఉంది.
మృతుల్లో ఆటో డ్రైవర్‌తోపాటు ఆటోలో ఉన్న ప్రయాణికులు కూడా ఉన్నారు. బస్టాప్ దగ్గర వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. బస్సు మంగళూరు నుంచి కాసరగోడ్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని మంజేశ్వర్ ఎమ్మెల్యే అష్రఫ్ తెలిపారు.
బ్రేక్ ఫెయిల్ వల్లే..
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే KSRTC, రోడ్డు రవాణా శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. బస్సు బ్రేక్‌లు పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే బ్రేక్ ఫెయిల్యూర్‌కు గల కారణం ఏంటో తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేపట్టారు. బస్సును KSRTC, ట్రాఫిక్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మెకానికల్ లోపాలు, నిర్వహణ ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం త్వరలో తెలియనుంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి