Share News

Vande Bharat Upgrade: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల అప్‌గ్రేడ్.. పలు మార్గాల్లో 20 కోచ్‌లతో మార్పు

ABN , Publish Date - Aug 28 , 2025 | 07:08 PM

ప్రస్తుతం వేగంగా, సౌకర్యంగా ప్రయాణించాలనుకునే వారికి వందే భారత్ రైళ్లు మంచి ఆప్షన్‎గా మారాయి. ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్‌ దృష్ట్యా దేశంలోని 7 ప్రధాన మార్గాల్లో వందే భారత్ రైళ్ల కోచ్‌లను మరింత పెంచింది రైల్వే శాఖ.

Vande Bharat Upgrade: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల అప్‌గ్రేడ్.. పలు మార్గాల్లో 20 కోచ్‌లతో మార్పు
Vande Bharat Upgrade

భారత రైల్వేలు ప్రయాణీకుల సౌకర్యం, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఏడు ప్రధాన మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది(Vande Bharat Upgrade). ప్రస్తుతం 8 కోచ్‌లు, 16 కోచ్‌లతో నడుస్తున్న ఈ రైళ్లను వరుసగా 16, 20 కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేశారు.

దీంతోపాటు కొత్త మార్గాల్లో కూడా వందే భారత్ సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ చొరవ ద్వారా మరికొంత మంది ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన రైలు ప్రయాణ అనుభవం అందుబాటులోకి రానుంది.


ఎందుకు ఈ అప్‌గ్రేడ్?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగం, ఆధునిక సౌకర్యాలు, విశ్వసనీయతతో ప్రయాణీకులను ఆకర్షించాయి. దీంతో ఈ రైళ్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఏడు కీలక మార్గాల్లో రద్దీ గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల సంఖ్యను ఎక్కువ మంది వినియోగించేలా కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏడు మార్గాల్లో నాలుగు రూట్లలో 8 కోచ్‌లు, మూడు రూట్లలో 16 కోచ్‌ల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిని 16, 20 కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియను 2025-26 ఆర్థిక సంవత్సరంలో (జూలై 31, 2025 వరకు) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.


ఏడు మార్గాలు ఏవి?

  • ఈ ప్రక్రియలో భాగంగా కింది ఏడు మార్గాల్లో నడిచే వందే భారత్ రైళ్లను అప్‌గ్రేడ్ చేశారు.

  • మంగళూరు సెంట్రల్–తిరువనంతపురం సెంట్రల్

  • సికింద్రాబాద్–తిరుపతి

  • చెన్నై ఎగ్మోర్–తిరునల్వేలి

  • మధురై–బెంగళూరు కంటోన్మెంట్

  • దేవఘర్–వారణాసి

  • హౌరా–రూర్కెలా

  • ఇండోర్–నాగ్‌పూర్

వీటిలో మొదటి మూడు మార్గాలైన మంగళూరు సెంట్రల్–తిరువనంతపురం సెంట్రల్, సికింద్రాబాద్–తిరుపతి, చెన్నై ఎగ్మోర్–తిరునెల్వేలి రూట్లలో ప్రస్తుతం 16-కోచ్‌ల రైళ్లు నడుస్తున్నాయి. వీటిని 20-కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేశారు. మిగిలిన నాలుగు మార్గాల్లో 8-కోచ్‌ల రైళ్లను 16-కోచ్‌లుగా మార్చారు. ఈ అప్‌గ్రేడ్‌తో ప్రయాణీకుల సామర్థ్యం పెరుగుతుంది.


కొత్త మార్గాల్లో వందే భారత్ సేవలు

అప్‌గ్రేడ్ ప్రక్రియలో భాగంగా ఖాళీ అయ్యే 8 కోచ్‌లు, 16 కోచ్‌ల రైళ్లను కొత్త మార్గాల్లో వందే భారత్ సేవలను ప్రారంభించడానికి ఉపయోగించనున్నారు. అదనంగా, కొత్త 20 కోచ్‌ల రైళ్లు కూడా త్వరలో సేవల్లోకి రానున్నాయి. ఈ కొత్త రూట్లలో రైళ్ల ప్రారంభ తేదీలు, ఇతర వివరాలను రైల్వే బోర్డు త్వరలో ప్రకటించనుంది. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా మరిన్ని నగరాలను వందే భారత్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2025 | 07:10 PM