Trump and Elon Musk Reunite: అమెరికాలో ఏం జరుగుతోంది?.. ఒకే వేదికపై ట్రంప్, మస్క్..
ABN, Publish Date - Sep 22 , 2025 | 07:01 AM
ట్రంప్ తీసుకువచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ఇద్దరి మధ్యా చిచ్చుపెట్టింది. దీన్ని మస్క్ వ్యతిరేకించారు. ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం చేసుకున్నారు.
అమెరికాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మతిపోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాల్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా టారీఫ్‌ల కారణంగా భారత్‌కు భారీ నష్టం వాటిల్లింది. తాజాగా, హెచ్ 1బీ వీసాల విషయంలోనూ భారత ఉద్యోగులకు పెద్ద దెబ్బ తగిలింది. హెచ్ 1 బీ వీసాల దరఖాస్తు రుసుమును ట్రంప్ లక్ష డాలర్లకు పెంచారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఒకే వేదికపై ట్రంప్, మస్క్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు మస్క్‌ల మధ్య గత కొంతకాలం నుంచి పరిస్థితులు బొత్తిగా బాలేవు. కొన్ని నెలల ముందు వరకు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా పరిస్థితి ఉండేది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ ఎంతో కృషి చేశారు. ఇద్దరూ దోస్త్ మేరా దోస్త్ అంటూ తిరిగేవారు. అయితే, ట్రంప్ తీసుకువచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ఇద్దరి మధ్యా చిచ్చుపెట్టింది. దీన్ని మస్క్ వ్యతిరేకించారు. ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం చేసుకున్నారు.
ఆ బిల్లును ఆపాలని మస్క్ చాలా రకాలుగా ప్రయత్నించారు. బిల్లుకు మద్దతు ఇవ్వాలనుకున్న సెనేటర్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా లాభం లేకపోయింది. బిల్లు ఆమోదం పొంది అమల్లోకి కూడా వచ్చింది. దీంతో మస్క్ తన కొత్తపార్టీని తెరపైకి తెచ్చారు. ‘ది అమెరికా పార్టీ’ని ప్రారంభించారు. ఆ వెంటనే మస్క్ సైలెంట్ అయిపోయారు. చాలా రోజుల తర్వాత ట్రంప్, మస్క్ ఒకే వేదికపై కనిపించారు. తాజాగా, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ మెమోరియల్ ఈవెంట్‌లో ఇద్దరూ పాల్గొన్నారు. ప్రైవేట్ బాక్సులో ట్రంప్, మస్క్ పక్కపక్కనే కూర్చున్నారు. కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
చైనా కే వీసా.. హెచ్-1బీ వీసాకు పోటీగా..
Updated Date - Sep 22 , 2025 | 07:22 AM