Trump Tariff India pharma: ట్రంప్ మళ్లీ షాకింగ్ ప్రకటన..భారత ఔషధ ఎగుమతులకు దెబ్బ..
ABN, Publish Date - Sep 26 , 2025 | 07:16 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో మరో షాకింగ్ ప్రకటన చేశారు. అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100% టారిఫ్ విధిస్తామని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం ప్రకటించారు. అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100% సుంకం (టారిఫ్) విధించబోతున్నట్టు గురువారం (Trump 100 percentage Tariff) ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఔషధ రంగాన్ని ప్రభావితం చేయనుండగా, భారతదేశానికి ఇది పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఎందుకంటే, అమెరికా మన దేశ ఔషధ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్‌గా ఉంది.
టారిఫ్‌లు పెరగడం వల్ల భారత ఔషధ కంపెనీలు దిగుమతులు తగ్గించుకోవాల్సి వస్తుంది. దీని వల్ల భారత కంపెనీలకు భారీగా నష్టం వస్తుంది. మరోవైపు అమెరికా ప్రజలకు ఖర్చులు కూడా పెరుగుతాయి. ట్రంప్ ప్రకటించిన ఈ టారిఫ్ విధానం ఎందుకు తీసుకున్నారో స్పష్టంగా తెలియకపోయినా, మళ్లీ వాణిజ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ప్రకారం అక్టోబర్ 1, 2025 నుంచి, బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధ ఉత్పత్తులపై 100% టారిఫ్ విధిస్తామన్నారు. కానీ, కంపెనీ అమెరికాలో తమ ఔషధ ఫ్యాక్టరీ ఉంటే, ఆ టారిఫ్ మినహాయించబడుతుంది. ఈ టారిఫ్ విషయంలో ట్రంప్ ఇంకా కిచెన్ క్యాబినెట్లు, బాత్‌రూమ్ వానిటీలపై 50% డ్యూటీ, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30%, హెవీ ట్రక్కులపై 25% టారిఫ్‌లు ప్రకటించారు. ఇవన్నీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ట్రంప్ ఈ నిర్ణయాలతో అమెరికాలో ఉద్యోగాలు పెంచాలని, ఉత్పత్తి అక్కడే జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌పై ఎలాంటి ప్రభావం?
భారతదేశ ఔషధ రంగం ప్రధానంగా అమెరికాపై ఆధారపడి ఉంటుంది. FY24లో మన ఔషధ ఎగుమతులు మొత్తం 27.9 బిలియన్ డాలర్లకు చేరాయి. వాటిలో 31% లేదా 8.7 బిలియన్ డాలర్ల విలువైన మందులు అమెరికాకు వెళ్లాయి. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) డేటా ప్రకారం, ఇది మన రంగానికి ప్రధాన ఆదాయ మార్గం.
FY25లో ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లకు ఎదుగుతాయని అంచనా. అమెరికాలో ఉపయోగించే జెనరిక్ మందులలో 45% పైగా, బయోసిమిలర్ డ్రగ్స్‌లో 15% మనదేశం నుంచే వెళ్తున్నాయి. ఈ 100% టారిఫ్ వల్ల దిగుమతులు తగ్గి భారత కంపెనీలు భారీ నష్టాలు ఎదుర్కొంటాయి.
స్కిన్‌స్కా ఫార్మాస్యూటికా స్పందన..
ఫార్మా ఉత్పత్తులపై వంద శాతం టారిఫ్స్ పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా పేల్చిన మరో బాంబుపై స్కిన్‌స్కా ఫార్మాస్యూటికా వ్యవస్థాపకులు, సీఎండీ రామ్ చింతలపూడి స్పందించారు. బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఔషధ దిగుమతులపై ట్రంప్ విధించిన సుంకం ప్రపంచ ఫార్మా ఎగుమతిదారులకు మేల్కొలుపని ఆయన అభివర్ణించారు. భారతదేశం ఉత్పత్తి చేస్తున్న జనరిక్ డ్రగ్ ఎగుమతులకు ప్రస్తుతానికి టారిఫ్ ముప్పు లేనప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు అవసరమని రామ్ చెప్పుకొచ్చారు. ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ కొత్త టారిఫ్స్, భారత ఔషధ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించబోతోందని ఆయన వెల్లడించారు. ఇది 'గ్లోబల్ ఫార్మా ఎగుమతులకు ఒక వార్నింగ్' వంటిదని చెప్పుకొచ్చారు. మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తన వ్యూహాలను పున:పరిశీలించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్కిన్‌స్కా ఫార్మాస్యూటికా, USFDA, ఇంకా UK కాస్మెటిక్ రెగ్యులేషన్స్ అప్రూవల్స్‌తో ఉందని.. ఇవి ప్రస్తుత పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కోవడానికి తమకు సహాయపడతాయని చెప్పారు. తాము ఎల్లప్పుడూ అందుబాటు ధరలో ఉండే సరికొత్త ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నామని.. దీంతోపాటు, అమెరికాలో భాగస్వామ్యాలను అన్వేషిస్తూ మరిన్ని ప్రొడక్షన్ యూనిట్లు నెలకొల్పుతామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 26 , 2025 | 06:13 PM