Nepal PM Sushila Karki: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం
ABN, Publish Date - Sep 12 , 2025 | 08:55 PM
నేపాల్‌లో కొద్దిరోజులుగా జన్ జీ నిరనసలు ఉవ్వెత్తున ఎగసిపడటం, పెద్దఎత్తున అల్లర్లు, దహనకాండం, హింస చోటుచేసుకోవడం, ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి వెళ్లపోవడం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కాఠ్మండూ: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి (Sushila Karki) శుక్రవారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్ష భవనం శీతల్ నివాస్‌లో అధ్యక్షుడు రాంచంద్ర పాడెల్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో దేశ తొలి మహిళా ప్రధాని క్రెడిట్‌ను ఆమె దక్కించుకున్నారు. 73 ఏళ్ల సుశీల కర్కిని తాత్కాలిక సారథిగా 'జన్ జీ' ఉద్యమకారులు ఎంపిక చేశారు. నేపాల్ ఆర్మీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌తో 'జన్ జీ' ప్రతినిధులు సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్లమెంటును రద్దు చేసి కర్కిని తాత్కాలిక ప్రధానిగా నియమించాలంటూ 'జన్ జీ' ప్రతినిధులు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు అంతా అంగీకారం తెలిపారు. దీంతో నేపాల్ పార్లమెంటును రద్దు చేశారు. ఆ వెనువెంటనే సుశీల కర్కి తాత్కాలిక పభుత్వ అధిపతిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపు పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
నేపాల్‌లో కొద్దిరోజులుగా జెన్‌జీ నిరనసలు ఉవ్వెత్తున ఎగసిపడటం, పెద్దఎత్తున అల్లర్లు, దహనకాండం, హింస చోటుచేసుకోవడం, ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి వెళ్లిపోవడం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ తొలి మహిళా చీఫ్ జస్టిస్, భారత్‌లోని బనారస్ హిందూ వర్శిటీ పాత విద్యార్థి అయిన సుశీల కర్కికి తాత్కాలిక ప్రధాని పదవి దక్కడం విశేషం.
అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని తత్వం
కర్కి 1952 జూన్ 7న బిరాట్‌నగర్‌లో జన్మించారు. 1971లో బిరాట్‌నగర్‌లోనే అడ్వకేట్‌గా లీగల్ కెరీర్ ప్రారంభించారు. క్రమంగా పలు పదోన్నతులు పొందుతూ 2009లో సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. 2016లో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని ధోరణి ప్రదర్శిస్తారనే గుర్తింపును పొందారు. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్సెస్‌లో ఆమె మాస్టర్ డిగ్రీ పొందారు. నేపాల్‌లోని త్రిభువన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్ర పట్టా (బ్యాటిలర్ డిగ్రీ) పొందారు. అవినీతి ఆరోపణలపై మంత్రి జయప్రకాష్ గుప్తాను దోషిగా నిర్ధారించి జైలుకు పంపిన చరిత్ర ఆమెది. తాజా ఉద్యమంలోనూ కర్కి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు
చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడి ఫొటోను రిలీజ్ చేసిన ఎఫ్‌బీఐ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 12 , 2025 | 09:54 PM