Pakistan angered: 'సింధ్' భారత్‌లోకి రావచ్చన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై పాక్ ఆగ్రహం
ABN, Publish Date - Nov 24 , 2025 | 09:44 AM
సింధ్ ప్రాంతంపై ఇటీవల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు హిందుత్వ విస్తరణా వాదాన్ని ప్రతిబింబిస్తాయన్న పాక్.. భారత్ ఇలాంటి విషయాలపై కాకుండా ఇతర అంశాలపై దృష్టిసారించాలని హితవు పలికింది.
ఇంటర్నెట్ డెస్క్: సింధ్ ప్రాంతం భారత్‌లోకి తిరిగి రావచ్చు, సరిహద్దులు మారవచ్చని ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలు హిందుత్వ విస్తరణ వాదాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొంది. ఇవి అంతర్జాతీయ చట్టం ద్వారా గుర్తించిన సరిహద్దుల సమగ్రత, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని పాక్ విదేశాంగ శాఖ మండిపడింది. సరిహద్దు ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ముప్పు వాటిల్లేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని భారత్‌ను కోరింది. భారత్ తమ పౌరుల భద్రత, ముఖ్యంగా బలహీన మైనార్టీ వర్గాల భద్రతపై దృష్టిసారించాలని హితవు పలికింది
సింధ్ ప్రాంతం భౌగోళికంగా భారత్‌లో లేకపోయినా నాగరికత పరంగా ఎప్పటికీ ఇండియాలో భాగమేనని ఇటీవల ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ అన్నారు. దీనిపై స్పందిస్తూ.. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఈశాన్య ప్రాంత సమస్యను రాజ్‌నాథ్ లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. భారత్.. ఇలాంటి విషయాలపై కాకుండా ఈశాన్య ప్రజలు తరచూ ఎదుర్కొంటున్న వివక్ష, గుర్తింపు ఆధారిత సమస్యలను పరిష్కరించాలని సూచించింది. అనంతరం జమ్ము కశ్మీర్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది పాక్.
సింధూ నది సమీపంలోని సింధ్ ప్రాంతం.. 1947లో దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయిందని రాజ్‌నాథ్ అన్నారు. అక్కడ నివసించే సింధ్ ప్రజలు ఇండియాకు వచ్చారన్నారు. సింధ్ హిందువులు ముఖ్యంగా ఎల్‌కే అడ్వాణీ వంటి నేతలు ఆ తరానికి చెందిన వారని, భారత్ నుంచి సింధ్ ప్రాంతం విడిపోవడాన్ని సింధ్ హిందువులు ఇప్పటికీ అంగీకరించడం లేదన్నారు. ఎల్‌కే అడ్వాణీ తన పుస్తకంలో ఈ విషయం రాసినట్టు చెప్పారు. సింధ్‌లోనే కాదు.. భారత్ అంతటా హిందువులు సింధూ నదిని అతి పవిత్రంగా భావిస్తారని తెలిపారు. చాలామంది ముస్లింలూ సింధూ నది నీటిని మక్కాలోని ఆబ్-ఎ-జంజామ్ కంటే తక్కువ పవిత్రమైనదేం కాదని విశ్వసిస్తారని పేర్కొన్నారు రాజ్‌నాథ్.
ఇవీ చదవండి:
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యం
జెలెన్‌స్కీపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్.. కృతజ్ఞత లేదని ఆగ్రహం
Updated Date - Nov 24 , 2025 | 10:08 AM