Nepal India Guidelines: రాజీనామాలతో ఊగిసలాడుతున్న నేపాల్ ప్రభుత్వం..భారత్ మార్గదర్శకాలు జారీ
ABN, Publish Date - Sep 09 , 2025 | 11:43 AM
నేపాల్‌లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడి భారతీయ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. పరిస్థితులు మారుతున్న క్రమంలో భారత విదేశాంగశాఖ కీలక అడ్వైజరీ విడుదల చేసి సూచనలు జారీ చేసింది.
నేపాల్‌లో ఇప్పుడు పరిస్థితి చాలా హీట్ హీట్‌గా ఉంది. సోషల్ మీడియా యాప్స్ విషయంలో నిషేధం ప్రకటించడంతో యువత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 19 మంది మరణించగా, 347 మందికిపైగా గాయపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఈరోజు సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం ఎత్తివేసినా.. రెండో రోజు ఆందోళనలు పలు చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి.
నిబంధనలు పాటించాలి
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మంగళవారం నేపాల్‌లోని భారత పౌరులకు కీలక సూచన జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో నేపాల్‌లోని పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు, నిబంధనలను పాటించాలని తెలిపింది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు సహనంతో వ్యవహరించి, సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని వెల్లడించింది.
జాగ్రత్తలు తీసుకోవాలి
దీంతోపాటు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. అత్యవసర ప్రయాణాలు తప్పించి, నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. శాంతియుత వాతావరణం తిరిగి నెలకొనేంతవరకూ జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ కోరింది. నేపాల్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రతే ప్రధానం అన్న నమ్మకంతో ఈ అడ్వైజరీని జారీ చేసింది.
2 రోజుల్లో ఇద్దరు మంత్రుల రాజీనామా
ఈ ఘర్షణల తర్వాత ఇద్దరు కీలక కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. హోం మంత్రి రమేష్ లేఖక్ సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేయగా, మంగళవారం ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి రామనాథ్ రిజైన్ చేశారు. ప్రజలు ప్రశ్నించే హక్కు వినియోగించుకున్నారంతే. కానీ ప్రభుత్వం మాత్రం బుల్లెట్లతో సమాధానం చెప్పింది. ఇది ప్రజాస్వామ్యం కాదు, అధినాయకత్వమని పేర్కొని పదవిని వదిలేశారు.
ఎలా హింసాత్మకమైంది?
మొదట్లో ఈ ప్రదర్శనలు శాంతియుతంగానే జరిగాయి. కానీ, కొందరు ఆందోళనకారులు పోలీసు బ్యారికేడ్‌లను దాటి నిషేధిత పార్లమెంట్ ప్రాంతాల్లోకి వెళ్లారు. అక్కడ కొంతమంది నీటి బాటిళ్లు, చెట్ల కొమ్మలు పోలీసుల మీదకు విసిరారు. దాంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో స్పందించారు. ఒక దశలో పోలీసులు తట్టుకోలేక పార్లమెంట్ కాంపౌండ్‌లోకి వెనక్కి వెళ్లిపోయారు. ఈ గొడవలో 19 మంది చనిపోయారు. దీంతో ప్రభుత్వం పార్లమెంట్, ముఖ్య కార్యాలయాలు, రాష్ట్రపతి భవనం చుట్టూ కర్ఫ్యూ విధించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 09 , 2025 | 11:53 AM