China Rongjiang Floods: చైనా రొంగ్‌జియాంగ్‌లో భారీ వరదలు.. 7 గంటల్లోనే వీధులన్ని శుభ్రం
ABN, Publish Date - Jul 03 , 2025 | 08:51 PM
చైనా రొంగ్‌జియాంగ్ ప్రాంతంలో ఇటీవల భారీ వరదలు (China Rongjiang Floods) స్థానికులను అతలాకుతలం చేశాయి. ఈ వరదల కారణంగా 1,20,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించబడగా, ఆరుగురు మరణించారు. కానీ ఈ విపత్తు తర్వాత ప్రభుత్వం, స్థానిక ప్రజలు కలిసి కేవలం 7 గంటల్లోనే వీధులన్ని శుభ్రం చేసి ఔరా అనిపించారు.
చైనాలోని రొంగ్‌జియాంగ్‌లో ఇటీవల భారీ వర్షాలు (China Rongjiang Floods) కురిశాయి. ఎంతలా అంటే గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వానలు కురియడంతో రొంగ్‌జియాంగ్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో 3,00,000 మంది జనాభాతో ఉన్న ఈ ప్రాంతంలోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఆ క్రమంలో జూన్ 28 నాటికి 41,574 మంది, 11,992 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరుగురు దురదృష్టవశాత్తూ మరణించారు. ఈ విపత్తు స్థానిక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది.
ఏడు గంటల అద్భుతం
ఇక జూన్ 29న ఉదయం 10 గంటలకు వరద స్థాయి తగ్గడంతో, రొంగ్‌జియాంగ్‌లో శుభ్రతా కార్యక్రమం మొదలైంది. చైనా ప్రభుత్వం వెంటనే అత్యవసరంగా పునర్నిర్మాణంపై ఫోకస్ చేయాలని ఆదేశించింది. దీంతో 20,000 మంది సిబ్బంది, 30,000 మంది స్థానికులు కలిసి కేవలం 7 గంటల్లోనే రోడ్లు, వీధులన్నీశుభ్రం చేశారు. 1,000 మంది సైనికులు బుల్‌డోజర్లతో సహాయం చేశారు. రెండు నీటి శుద్ధి కంపెనీలు కూడా పనిచేశాయి. ఆ క్రమంలో 43,000 క్యూబిక్ మీటర్ల నీటిని సరఫరా చేశాయి.
ఈ విజయం వెనుక..
చివరకు ఏడు గంటల్లోనే వీధులను శుభ్రం చేసి, జన జీవనాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఈ విజయం వెనుక చైనా ప్రభుత్వం, సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, స్థానికులు కలిసి పనిచేసిన ఐక్యత ఉంది. దీని కోసం 200 మిలియన్ యువాన్ (రూ.2,38,44,96,000) ఆర్థిక సహాయం విడుదల చేశారు. రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు పునరుద్ధరించబడ్డాయి. వాలంటీర్లు ఆహార సామగ్రిని పంపిణీ చేశారు. వైద్య సిబ్బంది సహాయం అందించారు. శానిటైజేషన్ బృందాలు క్రిమిసంహారక చర్యలు చేపట్టాయి. మొత్తంగా ఈ ఏడు గంటల శుభ్రతా యజ్ఞం చైనా ప్రజల ఐక్యత, పట్టుదలకు నిదర్శనమని చెప్పుకోవచ్చు.
విపత్తు వచ్చినప్పటికీ..
జూన్ 24 నుంచి రొంగ్‌జియాంగ్‌లో వర్షాలు కురిశాయి. మూడు నదుల సంగమంలో ఉన్న ఈ ప్రాంతం 3,00,000 మంది జనాభాను కలిగి ఉంది. రొంగ్‌జియాంగ్ ప్రాంతం ఫుట్‌బాల్ లీగ్‌కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ విపత్తు సమయంలో కూడా స్థానికులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 30,000 మందికిపైగా స్థానికులు క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చిన వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో రొంగ్‌జియాంగ్ సంఘటన ప్రస్తుతం ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి
చమురు తీసుకుంటే భారత్‌పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 03 , 2025 | 09:33 PM