Mass Protests Erupt in Nepa: భగ్గుమన్న నేపాల్
ABN, Publish Date - Sep 09 , 2025 | 03:05 AM
హిమాలయ దేశం నేపాల్‌లో రాజధాని నగరం కఠ్మాండూ సోమవారం నెత్తురోడింది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వందలు, వేల సంఖ్యలో యువత గళమెత్తింది...
ఆందోళనకారులపై కాల్పులు.. 20 మంది మృతి
400 మందికి పైగా యువకులకు గాయాలు
పార్లమెంట్ ఆవరణలోకి యువత
వాటర్ కెనాన్‌లు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్రతాబలగాల కాల్పులు
అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం
ప్రధాని శర్మ ఓలి దిగిపోవాలంటూ నినాదాలు
నేపాల్ హోంమంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా
కఠ్మాండూ, దేశ సరిహద్దుల్లో కర్ఫ్యూ విధింపు
అర్ధరాత్రి ఓలి ఇంటిపై రాళ్లదాడి.. కాల్పులు
అప్రమత్తమైన భారత్.. బిహార్‌లో హైఅలర్ట్
నేపాల్‌లో ఆందోళనల వెనక అమెరికా?
కఠ్మాండూ, సెప్టెంబరు 8: హిమాలయ దేశం నేపాల్‌లో రాజధాని నగరం కఠ్మాండూ సోమవారం నెత్తురోడింది. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వందలు, వేల సంఖ్యలో యువత గళమెత్తింది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను లెక్క చేయకుండా.. రోడ్లెక్కింది. పార్లమెంట్ భవనం ప్రాంగణంలోకి చొచ్చుకుపోయింది. వారిని అడ్డుకునేందుకు భద్రతాబలగాలు వాటర్ కెనాన్‌లను, టియర్‌గ్యా్‌సలను ప్రయోగించాయి. ఆందోళనకారులు కూడా బలగాలపై రాళ్లు, చెట్ల కొమ్మలతో దాడి చేశారు. దీంతో.. సైన్యం విచక్షణారహితంగా రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా.. 20 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 400 మందికి పైగా యువకులకు గాయాలయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం సోషల్ మీడియాను పునరుద్ధరించినా.. ముందుజాగ్రత్తగా కఠ్మాండూ సహా, పొఖారా తదితర జిల్లాలు, దేశ సరిహద్దుల వద్ద కర్ఫ్యూ విధించింది. శాంతిభద్రతల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ.. నేపాల్ హోంమంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. భారత్ కూడా అప్రమత్తమైంది. ఇండో-నేపాల్ సరిహద్దుల్లో సశస్త్ర సీమాబల్(ఎ్‌సఎ్‌సబీ) భద్రతను కట్టుదిట్టం చేసింది. నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటున్న బిహార్‌లోని ఏడు జిల్లాలు-- పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, మధుబని, అరారియా, సుపౌల్, కిషన్‌గంజ్ జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించి, సరిహద్దులను మూసివేసింది.
చూస్తుండగానే పెరిగిన ఆందోళనలు
నేపాల్ సర్కారు ఈ నెల 3న ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా.. 26 సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే..! ఈ చర్య భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తోందంటూ.. 30 ఏళ్లలోపు యువకులు(జెన్-జడ్) అందుబాటులో ఉన్న టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాన్ని లేవనెత్తారు. సోమవారం ఉదయం నుంచి ఒక్కొక్కరుగా రోడ్డెక్కారు. అలా మధ్యాహ్నానికి సుమారు 12 వేల మంది యువకులు నిరసనల్లో పాల్గొన్నారు. దాంతో.. కఠ్మాండూ ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. క్రమంగా ఆందోళనకారులు పార్లమెంట్ భవనం వైపు దూసుకెళ్లారు. కొందరు యువకులు గేట్లపైకెక్కి.. పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకుపోయారు. నేపాల్ చరిత్రలోనే ఆందోళనకారులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకురావడం ఇదే మొదటిసారి. దీంతో అక్కడున్న భద్రతాబలగాలు, సైన్యం వాటర్ కెనాన్‌లు, భాష్పవాయు గోళాలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఆందోళనకారులు కూడా తమ వద్ద పడిన భాష్పవాయు గోళాలు, రాళ్లు, చెట్ల కొమ్మలతో ఎదురుదాడికి దిగడంతో.. రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిరసనకారులు రాళ్లు రువ్విన ఘటనలో 178 మంది నేపాల్ పోలీసులు, 30 మంది సాయుధ బలగాలకు గాయాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆ మేరకు మధ్యాహ్నం 3.30 నుంచి ఫేస్‌బుక్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫారాలు నేపాల్‌లో తిరిగి పనిచేశాయి. అటు భద్రత బలగాలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ఇళ్లకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాయి. అయితే.. నేపాల్ కాలమానం ప్రకారం అర్ధరాత్రి సమయంలో ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలి ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ
యువత ఆందోళన సోమవారం అర్ధరాత్రికి నేపాల్ వ్యాప్తంగా విస్తరించింది. 7జిల్లాల్లో హింస నమోదైంది. ఈ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. కాగా.. యువత ఆందోళనలకు మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్(ప్రచండ) మద్దతు పలికారు. విదేశాల్లో నివసిస్తున్న నేపాలీలు కూడా జెన్-జడ్ ఉద్యమానికి మద్దతిచ్చారు.
కేపీ శర్మ ఓలి.. దిగిపో
సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం కాస్తా.. ప్రభుత్వ చర్యలు, మరణాలతో రూపాంతరం చెందింది. అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా మారింది. ఆందోళనకారులు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. ఆయనను ఒక దొంగగా పేర్కొంటూ.. ‘కేపీ చోర్’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వం అప్రమత్తమై.. అత్యవసరంగా జాతీయ భద్రత సమావేశాన్ని ఏర్పాటు చేసింది. యువతపై కాల్పులను నేపాల్ విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. సీపీఎన్(మావోయిస్టు సెంటర్) డిప్యూటీ జనరల్ సెక్రటరీ బర్షమన్ పున్, ఎన్‌సీపీ ప్రధాన కార్యదర్శి కబీంద్రతోపాటు.. కాంగ్రె్‌స-యూఎంఎల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ(ఆర్పీపీ), సీపీఎన్(యూఎంఎల్), సోషలిస్టు పార్టీలు ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. ఒక్క హోంమంత్రి రాజీనామాతో సరిపోదని కేపీ శర్మ ఓలి సహా.. మంత్రిమండలి రాజీనామా చేయాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. వీరికి మంత్రిమండలిలో కూర్చునే నైతిక అర్హత లేదన్నారు.
అమెరికా పాత్ర?
నేపాల్ ఆందోళనల వెనక అమెరికా పాత్ర ఉందంటూ నేపాలీ పత్రికల అనుబంధ వెబ్‌సైట్లు కథనాలను ప్రచురించాయి. అందుకే సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాస్తా.. ‘కేపీ శర్మ ఓలి దిగిపో’ అనే నినాదం వైపు మళ్లినట్లు విశ్లేషించాయి. ఓలి చైనాకు ఆప్తుడు అనే విషయం తెలిసిందే..! అయితే.. ఇటీవలికాలంలో అమెరికా నేపాల్‌లో ప్రాజెక్టులను చేపట్టింది. అందుకే.. ఆర్థిక, దౌత్య మద్దతును పెంచింది. మిలీనియం చాలెంజ్ కార్పొరేషన్(ఎంసీసీ) వంటి సంస్థలు రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాయి. ఎన్‌ఎంబీ బ్యాంకుతో కలిసి నేపాల్ ప్రభుత్వం 2025లో అమెరికా అనుబంధ సంస్థలైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎ్‌ఫసీ), బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వె్‌స్టమెంట్(బీఐఐ) ద్వారా 60 మిలియన్ డాలర్ల ‘గ్రీన్ బాండ్’ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇటీవల ప్రధాని ఓలి తీసుకున్న పలు నిర్ణయాలతో కొన్ని అమెరికా ప్రాజెక్టులకు బ్రేకులు పడ్డాయి. దీంతో.. ఓలికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని అమెరికా తెరవెనక ఉండి నడుపుతోందని నేపాలీ పత్రికలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News
Updated Date - Sep 09 , 2025 | 03:05 AM