Share News

Vice Presidential Election: రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

ABN , Publish Date - Sep 08 , 2025 | 03:39 AM

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. పాలక ఎన్‌డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ (67), విపక్ష ‘ఇండీ’ కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి (79) పోటీచేస్తున్న....

Vice Presidential Election: రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

  • ఎన్‌డీఏ తరఫున సీపీ రాధాకృష్ణన్‌ ‘ఇండీ’ అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

  • పోలింగ్‌కు రెండు కూటములూ సిద్ధం

  • ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలకు వర్క్‌షాప్‌

  • నేడు విపక్షాల సభ్యులకు మాక్‌ పోల్‌

  • సంఖ్యాబలం ఎన్‌డీఏ వైపే

  • పార్లమెంటు ఉభయసభల్లో ప్రస్తుతం 781 మంది సభ్యులు

  • వీరిలో పాలక కూటమి సంఖ్య 425

  • ‘ఇండీ’కి 311, ఇతరులకు 45

  • క్రాస్‌ ఓటింగ్‌పై కాంగ్రెస్‌ ఆశలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయసభల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. పాలక ఎన్‌డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ (67), విపక్ష ‘ఇండీ’ కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి (79) పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. తమ తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ రెండు కూటములూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన రెండ్రోజుల వర్క్‌షాప్‌ ఆదివారం ఢిల్లీలో మొదలైంది. ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. సోమవారం ఎన్‌డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్‌ సోమవారం మధ్యాహ్నం సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాలులో మాక్‌పోల్‌ నిర్వహించి.. ఓటు ఎలా వేయాలో వివరిస్తుంది. రాత్రికి ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వారికి విందు ఇవ్వనున్నారు. అన్ని పార్టీల ఎంపీలూ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్‌రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చేశారు. తాను ఏ పార్టీ తరఫునా పోటీ చేయడం లేదని, రాజకీయాలకతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ రిటర్నింగ్‌ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవనంలోని వసుధలో ఎఫ్‌-101 గదిలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.


ఎన్‌డీఏ వైపే మొగ్గు!

ఉభయసభల్లో ఎన్‌డీఏకే సంఖ్యాబలం ఉంది. రెండు సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మంది (లోక్‌సభలో 542, రాజ్యసభలో 239 మంది) ఉన్నారు. ఎన్‌డీఏకి 425 మంది, ఇండీ కూటమికి 311 మంది, ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులున్నారు. ఇతర ప్రతిపక్షాల్లో వైసీపీ (11).. ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బీజేడీ (7) మద్దతు కోసం ఆ పార్టీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేశారు. సరైన సమయంలో తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీఆర్‌ఎస్‌ ఎంపీ కె.సురేశ్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. శిరోమణి అకాలీదళ్‌ వంటి ఏక సభ్య పార్టీలు, స్వతంత్రులు ఎటు మొగ్గుతారో చూడాల్సి ఉంది. రహస్య బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరుగనున్నందున.. అధికార కూటమి నుంచి సుదర్శన్‌రెడ్డికి క్రాస్‌ఓటింగ్‌ జరుగుతుందని కాంగ్రెస్‌ ఆశాభావంతో ఉంది. అటు బీజేపీ కూడా.. తమిళనాడు ఎంపీల్లో కొందరు తమ రాష్ట్రానికే చెందిన రాధాకృష్ణన్‌ వైపు మొగ్గుచూపుతారని అంచనా వేస్తోంది. దళిత, ఆదివాసీ ఎంపీలందరూ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికే మద్దతివ్వాలని తమిళనాడుకు చెందిన వీసీకే ఎంపీ తిరుమావళవన్‌ ఒక లేఖలో పిలుపిచ్చారు. ఆయన పార్టీకి లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్నారు.


గతంలో ఎవరికెన్ని..?

2002 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భైరాన్‌సింగ్‌ షెకావత్‌కు 454 ఓట్లు రాగా.. ఆయనపై బరిలోకి దిగిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ షిండేకు 302 ఓట్లు వచ్చాయి. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు 516 ఓట్లు సాధించగా.. ప్రత్యర్థి గోపాలకృష్ణ గాంధీకి కేవలం 244 ఓట్లు వచ్చాయి. 2022 ఎన్నికల్లో జగదీప్‌ ధన్‌ఖడ్‌కు 520 ఓట్లు వచ్చాయి. విపక్షాల ఐక్య అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వా కేవలం 182 ఓట్లు సాధించారు. ఈసారి ఎన్‌డీఏ అభ్యర్థికి 500 ఓట్లలోపే వచ్చే అవకాశాలున్నాయి. ప్రతిపక్షాలు తమకు ఉన్న మొత్తం 324 ఓట్లు సాధించినప్పటికీ.. అన్ని ఎక్కువ ఓట్లు పొంది ఓడిపోవడం ఇదే మొదటిసారి అవుతుంది.


చెల్లని ఓట్లపై బెంగ..

చెల్లని ఓట్లపై రెండు కూటముల్లో ఆందోళన నెలకొంది. 2022లో 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకపోవడమే దీనికి కారణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంపీలకు కూడా ఓటు వేయడం రాకపోతే ఎలాగని ఉభయ కూటముల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీలు తమ ఓటింగ్‌ ప్రాధాన్యాలను అక్షరాల్లో కాకుండా అంకెల ద్వారా సూచించాలని.. కానీ కొందరు అది గ్రహించలేకపోతున్నారని వారు చెబుతున్నారు. అంతేగాక.. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నిర్దిష్ట పెన్నులతోనే వారు తమ ప్రాధాన్యాలను తెలుపవలసి ఉంటుంది. మరే ఇతర పెన్నులు వాడినా ఓటు చెల్లదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రతి 15 మంది పార్టీ ఎంపీలకు ఒక సమన్వయకర్తను నియమించింది. ప్రతిపక్ష సభ్యులను సమన్వయపరిచేందుకు ప్రత్యేక బృందాలను మోహరించింది.


వెనుక వరుసలో మోదీ

ప్రధాని మోదీ వర్క్‌షాప్‌లో వెనుక వరుసలో ఉన్న ఎంపీలతో పాటు కూర్చోవడం విశేషం. ఆయన్ను ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలు సత్కరించారు. పేద, మధ్యతరగతికి భారీ ఊరట కల్పించేలా జీఎ్‌సటీ 2.0 సంస్కరణలు తెచ్చినందుకు ప్రశంసలు కురిపించారు. సవరించిన జీఎ్‌సటీ దసరా నవరాత్రుల తొలి రోజైన ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ‘2027నాటికి అభివృద్ధి భారతం’, సామాజిక మాధ్యమాలను ఎంపీలు సమర్థంగా వినియోగించుకోవడం’ అనే అంశాలపై ఎంపీలు ఉదయం చర్చించారు. మధ్యాహ్నం వారంతా వివిధ కమిటీలుగా ఏర్పడి.. వ్యవసాయం, రక్షణ, ఇంధన, విద్య,రైల్వే, రవాణా శాఖలపై చర్చించారు. సోమవారం పూర్తిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో శిక్షణపైనే వర్క్‌షాప్‌ దృష్టి కేంద్రీకరిస్తుంది.

Updated Date - Sep 08 , 2025 | 03:43 AM