Vice Presidential Election: ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
ABN , Publish Date - Sep 08 , 2025 | 06:21 PM
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోరు నెలకొంది.
న్యూఢిల్లీ: బీజేపీ (BJP) సారథ్యంలోని ఎన్డీయే (NDA), విపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి (INDIA Alliance) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక (Vice presidential Election) మంగళవారం నాడు జరగనుంది. ఈ ఎన్నికలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలి ఓటు వేయనున్నారు. పంజాబ్, హర్యానా ఎంపీలతో కలిసి ప్రధాని తన ఓటు హక్కును వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండేలను ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్షన్ ఏజెంట్లుగా నియమించారు.
ఎన్డీయే ఎంపీలకు మోదీ డిన్నర్
మరి కొద్ది గంటల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీయే ఎంపీలకు సోమవారం రాత్రి 8 గంటలకు డిన్నర్ ఇస్తున్నారు. ఓటింగ్ సందర్భంగా ఎంపీల మధ్య పూర్తి సమన్వయం, ఐక్యతకు ఈ తరహా విందు సమావేశాలు ఎంతో ఉపకరిస్తుంటాయని ఎన్డీయే సీనియర్ నేత ఒకరు తెలిపారు. తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఎన్డీయే భాగస్వాముల నుంచి పూర్తి మద్దతు ఉందని చెప్పారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు జగ్‌దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోరు నెలకొంది. ఉభయసభల్లోని ఎంపీలు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యాంగంలోని 64, 68 అధికరణలోని నిబంధనల కింద ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసింది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది.
ఇవి కూడా చదవండి..
బీఆర్ఎస్ బాటలో బీజేడీ.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం
For More National News And Telugu News