Share News

Vice Presidential Polls: బీఆర్ఎస్ బాటలో బీజేడీ.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం

ABN , Publish Date - Sep 08 , 2025 | 05:31 PM

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు.

Vice Presidential Polls: బీఆర్ఎస్ బాటలో బీజేడీ.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం
Vice President Polls

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల (Vice President Polls)కు దూరంగా ఉండనున్నట్టు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ (BJD) ప్రకటించింది. మంగళవారంనాడు జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తమ పార్టీ ఎంపీలు దూరంగా ఉంటారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర (Sasmit Patra) ఢిల్లీలో తెలిపారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమికి తమ పార్టీ సమానదూరం పాటించాలనే విధానంలో భాగంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ సీనియర్ నేతలు, పొలిటకల్ ఆఫైర్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలతో బిజా పట్నాయక్ సంప్రదించిన తర్వాతే ఓటింగ్‌కు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బిజూ జనతాదళ్‌కు రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు.


కాగా, ఇప్పటికే ఈ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు భారత రాష్ట్ర సమితి (BRS) ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతపై తమ ఆందోళనను తెలియజేసేందుకు, రైతులకు మద్దతుగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలిపారు. రైతుల సమస్యను బీజేపీ, కాంగ్రెస్ పరిష్కరించాలన్నారు. బీఆర్ఎస్‌కు పార్లమెంటులో నలుగురు సభ్యులు ఉన్నారు.


ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా, విపక్ష 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి పోటీలో ఉన్నారు.


ఓటింగ్ సమయం

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, 12 నామినేటెడ్ సభ్యులు, లోక్‌సభకు ఎన్నికైన 543 మంది సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. బలాబలాల ప్రకారం, 542 మంది సభ్యుల లోక్‌సభలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 293 మంది సభ్యులు, రాజ్యసభలో 129 మంది సభ్యుల బలం ఉంది. ఉభయసభల్లోని 786 మంది ఎంపీలు ఉండగా, 394 ఓట్లు సాధించిన అభ్యర్థిని విజయం వరిస్తుంది. ఆ ప్రకారం 422 మంది సభ్యుల మద్దతుతో ఎన్డీయే విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

ఆధార్‌ను అంగీకరించాల్సిందే.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 08 , 2025 | 05:33 PM