Marco Rubio: ఇరాన్ నిర్ణయంతో షాక్.. చైనా సాయం కోరిన అమెరికా
ABN, Publish Date - Jun 23 , 2025 | 08:41 AM
హార్ముజ్ జలసంధిని మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ఆందోళన రేకెత్తించడంతో అమెరికా చైనా సాయాన్ని అభ్యర్థించింది. ఇరాన్ మనసు మార్చాలని కోరింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్వయంగా వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: అణు స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముడి చమురు, సహజ వాయువు రవాణాకు కీలకంగా ఉన్న ఈ జలమార్గాన్ని మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురయిన అమెరికా చైనా సాయం కోరింది. ఇరాన్ మనసు మార్చాలని అభ్యర్థించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సెక్రెటరీ మార్కో రూబియో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
మధ్య ప్రాచ్య దేశాల వ్యవహారాల్లో చైనా కూడా కీలక భాగస్వామి అని మార్కో రూబియో పేర్కొన్నారు. ముడి చమురు రవాణా కోసం హార్మూజ్ జలసంధిపై ఇతర దేశాలు కూడా ఆధారపడ్డాయని అన్నారు. ఈ నేపథ్యంలో చైనా తక్షణం జోక్యం చేసుకోవాలని, ఇరాన్ మనసు మార్చాలని పేర్కొన్నారు.
‘హార్ముజ్ జలసంధిని మూసివేస్తే మరో భారీ తప్పిదం చేసినట్టే. వాళ్లకు అది ఆర్థికంగా ఆత్మహత్యతో సమానం’ అని మంత్రి రూబియో స్పష్టం చేశారు. ఈ పరిస్థితి తలెత్తితే ఏం చేయాలనే విషయంలో అమెరికాకు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఈ చర్యల ఆర్థిక పర్యవసానాలు అమెరికాకంటే మిగతా దేశాలపైనే ఎక్కువగా ఉంటాయని అన్నారు.
మరోవైపు, అమెరికా దాడులను చైనా తీవ్రంగా ఖండించింది. దీన్నో ప్రమాదకరమైన మలుపుగా అభివర్ణించింది. 2003 ఇరాక్ యుద్ధం నాటి తప్పులనే అమెరికా మళ్లీ చేస్తోందని పేర్కొంది. మిలిటరీ చర్యలను కట్టిపెట్టి దౌత్య మార్గాల వైపు మళ్లాలని సూచించింది.
ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి కీలకమన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని 20 శాతం చమురు, సహజవాయువు రవాణా ఈ జలమార్గం మీదుగా సాగుతుంది. ఈ ప్రాంతంలో అస్థిరత యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్‌పై దాడి.. వీటి శక్తి ఎంతో తెలిస్తే..
ముడి చమురు ధరలకు రెక్కలు.. అమెరికా దాడులతో ఆందోళనలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 23 , 2025 | 11:25 AM