US Bunker Buster: జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్‌పై దాడి.. వీటి శక్తి ఎంతో తెలిస్తే..
ABN , Publish Date - Jun 22 , 2025 | 10:57 AM
మునుపెన్నడూ వినియోగించని జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేసింది. ఇవి భూమి లోపలికి 200 అడుగుల వరకూ చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించగలవు.
ఇంటర్నెట్ డెస్క్: భూగర్భంలో దాగున్న అణుపదార్థ శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసేందుకు బంకర్ బస్టర్ (GBU-57 Bunker Buster) బాంబులను వాడినట్టు అమెరికా తాజాగా ప్రకటించింది. మొత్తం ఆరు జీబీయూ-57 అనే బంకర్ బస్టర్ బాంబులను ఫర్డో అణుస్థావరంపై వదిలినట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆయుధాన్ని అమెరికా గతంలో ఎన్నడూ వాడలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏమిటీ జీబీయూ-57
అమెరికా ఆయుధ సంపత్తిలో అత్యంత శక్తిమంతమై సంప్రదాయక ఆయుధం జీబీయూ-57. ఇది భూమిలోకి 200 అడుగుల లోతు వరకూ దూసుకెళ్లి విధ్వంసం సృష్టించగలదు. దాదాపు 60 అడుగుల మందంలో ఉన్న కాంక్రీట్ స్లాబ్స్‌లోంచి దూసుకెళ్లి శత్రువును ఛేదించగలదు. భూగర్భంలో, దుర్బేధ్యమైన కట్టడాల్లో ఉన్న లక్ష్యాలు ఛేదించేందుకు అమెరికా జీబీయూ-57ను ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంది. ఇక ఫర్డో అణు శుద్ధి కేంద్రం భూగర్భానికి సుమారు 195 అడుగుల నుంచి 295 అడుగుల లోతున ఉండి ఉండొచ్చని ఇజ్రాయెల్ దళాలు అంచనా వేశాయి. ఇంతలోపలకు వెళ్లి ధ్వంసం చేసేందుకు అమెరికా రెండు బీజీయూ -57లను వాడి ఉండొచ్చు. మొదటి బాంబుతో ఏర్పడిన భారీ గొయ్యిలోకి రెండో బాంబు దూసుకెళ్లి చివరన ఉన్న అణు స్థావరాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా దాడిలో కూడా ఫర్డో స్థావరానికి రక్షణగా ఉన్న భారీ కాంక్రీట్ గోడలను ఛేదించి జీబీయూ-57 విధ్వంసం సృష్టించింది. ఒక్కో బాంబు దాదాపు 15 టన్నుల (30 వేల పౌండ్‌లు) బరువు ఉంటుంది. బీ-2 స్పిరిట్ బాంబర్ల ద్వారా మాత్రమే దీన్ని ప్రయోగించడం సాధ్యమవుతుంది. ఇది అధిక బరువున్న బాంబులు కావడంతో ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం కేవలం రెండింటిని మాత్రమే మోసుకెళ్లగలదు. ఇజ్రాయెల్ వద్ద కేవలం 2 వేల నుంచి 5 వేల పౌండ్‌ల బరువున్న బంకర్ బస్టర్‌లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ స్థావరాన్ని టార్గెట్ చేయలేక ఇజ్రాయెల్ ఇక్కట్ల పాలయ్యింది.
జీబీయూ-57తో పాటు అమెరికా టామాహాక్ మిసైళ్లను కూడా ప్రయోగించింది. నేవీ సబ్‌మెరైన్‌ల నుంచి వీటిని లాంచ్ చేస్తారట. నాటనాజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలను వీటితోనే ధ్వంసం చేసినట్టు సమాచారం. ఇరాన్‌పై ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో ఇదే అత్యంత సంక్లిష్టమైనదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమానికి కీలకమైన మూడు స్థావరాలనూ అమెరికా తాజా దాడుల్లో ధ్వంసం చేసింది.
ఇవీ చదవండి:
ఇరాన్ అణుస్థావరాలపై దాడులు.. ట్రంప్‌పై నెతన్యాహూ ప్రశంసల వర్షం
ముడి చమురు ధరలకు రెక్కలు.. అమెరికా దాడులతో ఆందోళనలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి