LATAM Aircraft Fire: టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో రేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
ABN, Publish Date - Dec 06 , 2025 | 11:49 AM
బ్రెజిల్‌లో లాటమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మంటలు చెలరేగడం కలకలానికి దారి తీసింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 180 మంది ప్రయాణికులు ఉన్న విమానం రన్‌వే పైకి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం శావొ పావొలో నగరంలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది (LATAM Airlines Flight Catches Fire).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, లాటమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం టాక్సీయింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈలోపు అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
కాగా, ఈ ఘటనపై లాటమ్ ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. మంటలు చెలరేగడానికి విమానం కారణం కాదని వివరించింది. లగేజీని విమానంలోకి చేర్చే లోడర్ అనే యంత్రంలో మంటలు చెలరేగి విమానానికి వ్యాపించాయని పేర్కొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి:
కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్
తీరు మార్చుకోని పాక్.. భారత గగనతలంలోకి విమానాలను అనుమతించినా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 06 , 2025 | 11:53 AM