Epstein Files: విమర్శలకు వెనక్కుతగ్గిన అమెరికా న్యాయశాఖ.. ట్రంప్ ఫొటోల పునరుద్ధరణ
ABN, Publish Date - Dec 22 , 2025 | 09:34 AM
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ ఫొటోలను బహిరంగపరచకపోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా న్యాయ శాఖ వెనక్కు తగ్గింది. తాజాగా ఆ ఫొటోలను విడుదల చేసింది. తమ చర్యకు గల కారణాలను కూడా వివరించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో కలకలం రేపుతున్న లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను ఇటీవల అక్కడి న్యాయశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, వాటిల్లో కొన్ని ట్రంప్ ఫొటోలను బహిరంగపరచకుండా తొక్కిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తడంతో న్యాయశాఖ వెనక్కు వేసింది. మునుపటి ఫొటోలను ఫైల్స్‌లోకి మళ్లీ చేర్చింది. ఎప్‌స్టీన్ ఉపయోగించిన డెస్క్‌పై ట్రంప్ ఫొటోలు ఉన్న చిత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక ఫొటోలో ట్రంప్ కొందరు మహిళలతో పోజులిస్తూ కనిపించారు. మరో ఫొటోలో ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, ఎప్‌స్టీన్ స్నేహితురాలు ఝిస్‌లెయిన్ మ్యాక్స్‌వెల్ కూడా ఉన్నారు (Epstein Files Trump Photos).
మొదట రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్‌లో ఈ ఫొటోలు లేకపోవడంపై న్యాయశాఖ వివరణ ఇచ్చింది. ఆ ఫొటోల్లో ఎప్‌స్టీన్ బారిన పడ్డ కొందరు బాధితులు కూడా ఉండే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్తగా ఫొటోలను తాత్కాలికంగా తొలగించాల్సి వచ్చిందని వెల్లడించింది. ఈ విషయంలో న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ అధికారులు అప్రమత్తం చేశారని వెల్లడించింది. అయితే, బాధితులు ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక మళ్లీ వాటిని బహిరంగ పరిచినట్టు వెల్లడించింది. ముందుజాగ్రత్త చర్యగా తొలగింపు చేపట్టాల్సి వచ్చిందని చెప్పింది.
అమెరికా మీడియా కథనాల ప్రకారం, తొలుత విడుదల చేసిన ఫైల్స్‌లో మొత్తం 16 డాక్యుమెంట్స్‌ను బహిరంగ పరచలేదు. ఈ డాక్యుమెంట్స్‌లో ఎప్‌స్టీన్ ఇంట్లోని వివిధ ఫొటోలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డెమాక్రాట్‌లు న్యాయశాఖపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ట్రంప్ స్వయంగా అధ్యక్షుడై ఉండి కూడా చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. ట్రంప్ సొంత పార్టీకి చెందిన నేత థామస్ మేసీ కూడా డెమాక్రాట్స్‌కు మద్దతు పలుకుతూ పూర్తి ఫైల్స్ డిమాండ్ చేయాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన న్యాయశాఖ ఆ ఫైల్స్‌ను రిలీజ్ చేసింది.
ఇవీ చదవండి:
శ్వేత సౌధం సలహాదారు శ్రీరామ్ కృష్ణన్‌పై ట్రంప్ ప్రశంసలు! అతడు లేకపోతే..
పరువు పోగొట్టుకుంటున్న పాక్.. సౌదీలో 56 వేల మంది పాక్ యాచకుల బహిష్కరణ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 22 , 2025 | 09:47 AM