Pakistan Beggars Deported: పరువు పోగొట్టుకుంటున్న పాక్.. సౌదీలో 56 వేల మంది పాక్ యాచకుల బహిష్కరణ
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:28 PM
ఈ ఏడాది ఇప్పటివరకూ సౌదీ అరేబియా దాదాపు 56 వేల మంది పాక్ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించింది. ఈ బిచ్చగాళ్ల మాఫియాతో భయపడి పోయిన యూఏఈ కూడా పాక్ జాతీయులకు వీసాల జారీని తగ్గించేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బిచ్చగాళ్ల మాఫియాతో పాక్‌కు అంతర్జాతీయంగా తలవంపులు వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ సౌదీ అరేబియా దాదాపు 56 వేల మంది పాకిస్థానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించింది. సౌదీతో పాటు ఇతర గల్ఫ్ దేశాలు కూడా పాక్ యాచక ముఠాలతో సతమతమవుతున్నాయి. అక్కడి ముఖ్యమైన స్థలాల్లో పాక్ జాతీయులు భిక్షాటన చేస్తూ విదేశీ టూరిస్టులను డబ్బుల కోసం వేధిస్తుంటారు. ఈ విషయంలో ఇప్పటికే గల్ఫ్ దేశాలు పాకిస్థాన్‌ను హెచ్చరించాయి (Saudi Deports Pak Beggars). పాకిస్థానీల క్రిమినల్ కార్యకలాపాల నేపథ్యంలో యూఏఈ గత నెలలో అధికశాతం మంది పాక్ జాతీయులకు వీసాలను నిరాకరించింది. ఉమ్రా వీసాలను దుర్వినియోగ పరచొద్దని సౌదీ అరేబియా పాక్‌ను హెచ్చరించింది.
పాక్‌లో బిచ్చగాళ్ల మాఫియా ఏ స్థాయిలో ఉందో చెప్పే గణాంకాలను అక్కడి ప్రభుత్వం స్వయంగా పార్లమెంటులో బయటపెట్టింది. బిచ్చగాళ్లు, క్రిమినల్ గ్యాంగ్‌ల్లో సభ్యులుగా ఉన్న వేల మందిని పాక్ ప్రభుత్వం నో-ఫ్లై లిస్టులో చేర్చింది. విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన మరో 66 వేల మందిని ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నట్టు పేర్కొంది.
ఈ ముఠాల వల్ల తాము అంతర్జాతీయంగా అపప్రథ మూటకట్టుకోవాల్సి వస్తోందని పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్ తెలిపారు. కొన్నేళ్లుగా పాక్‌లో ఈ ముఠాలు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. యాత్రల పేరిట పశ్చిమాసియా దేశాలకు వెళ్లి అక్కడికి వచ్చే విదేశీయుల వద్ద భిక్షాటన చేస్తూ దేశం పరువు తీస్తున్నారు. ఈ తీరుపై పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన పెరుగుతోంది. ఫలితంగా వీసాలపై ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. చివరకు సాధారణ పాక్ ప్రజానీకం వీసాలు పొందలేక ఇక్కట్ల పాలవుతున్నారు. ‘ఇటీవలే సౌదీకి వెళ్లి ప్రత్యక్షంగా చూశా. అక్కడ మా వాళ్లు పెద్ద సంఖ్యలో భిక్షాటన చేస్తున్నారు. నాకు పరువు పోయినట్టు అనిపించింది’ అని ఇస్లామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కామెంట్ చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, కొన్ని ముఠాలు ఇలాంటి కార్యకలాపాల్లో ఆరి తేరిపోయాయట. వీటి ఆటకట్టించేందుకు పాక్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం రావట్లేదని సగటు పాకిస్థానీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. స్థానిక పత్రికలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
ఐఎమ్ఎఫ్‌తో చిక్కులు.. అధిక కండోమ్స్ ధరలతో పాక్ సతమతం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి