Share News

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. స్థానిక పత్రికలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

ABN , Publish Date - Dec 19 , 2025 | 08:32 AM

బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్, యువ నేత హైదీ మృతి చెందడంతో కలకలం రేగుతోంది. నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు పత్రికల కార్యాలయాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు.

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. స్థానిక పత్రికలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
Bangladesh Unrest

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి బంగ్లాదేశ్ తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హైదీ మరణం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాజీ ప్రధాని, ఆవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా రేగిన నిరసనల్లో హైదీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక హైదీ మరణ వార్తతో బంగ్లాదేశ్‌లో నిరసనలు మిన్నంటాయి. భారతీయ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయంతో పాటు స్థానిక పత్రికలను కూడా నిరసనకారులు టార్గెట్ చేశారు (Haidi Death - Bangladesh Violent Protests).

దేశ రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఛత్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఆవామీ లీగ్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఆవామీ లీగ్ కార్యాలయాలతో పాటు పత్రికా ఆఫీసులనూ ఆందోళనకారులు టార్గెట్ చేశారు. ప్రథమ్ ఆలో, డెయిలీ స్టార్ పత్రికా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. హైదీ పేరిట పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డెయిలీ స్టార్ కార్యాలయంలో మంటలు రేగడంతో పులువురు జర్నలిస్టులు చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు.


డెయిలీ స్టార్ కార్యాలయంలో మంటల్లో చిక్కుకున్న సుమారు 25 మందిని భద్రతాదళాలు కష్టపడి రక్షించాయి. నిరసనకారులతో చర్చించేందుకు ప్రయత్నించిన న్యూఏజ్ పత్రిక ఎడిటర్‌పై కూడా దాడి జరిగింది. దీంతో, ఆయా పత్రికలు నేడు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజీబ్ నివాసాన్ని కూడా దుండగులు టార్గెట్ చేశారు. ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఆ ఇంటిని ధ్వంసం చేశారు.

వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంక్విలాబ్ మంచ్‌ తరపున బరిలోకి దిగిన హైదీ.. అవామీ లీగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సమయంలో హత్యకు గురయ్యారు. గత వారం అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం అతడిని సింగపూర్‌కు తరలించగా అక్కడే కన్నుమూసినట్టు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


ఇవీ చదవండి:

ఐఎమ్ఎఫ్‌తో చిక్కులు.. అధిక కండోమ్స్ ధరలతో పాక్‌ సతమతం

పాక్ గగనతలంలోకి భారత్ విమానాల నిషేధం.. జనవరి 23 వరకూ పొడిగింపు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 19 , 2025 | 09:29 AM