IMF Rejects Pak's Plea: ఐఎమ్ఎఫ్‌తో చిక్కులు.. అధిక కండోమ్స్ ధరలతో పాక్ సతమతం
ABN , Publish Date - Dec 19 , 2025 | 07:31 AM
కండోమ్స్‌పై జీఎస్టీని తగ్గించేందుకు అనుమతించాలంటూ పాక్ చేసిన ప్రతిపాదనను ఐఎమ్ఎఫ్ తిరస్కరించింది. ఆదాయం ఆశించిన మేర పెరగని ప్రస్తుత పరిస్థితుల్లో పన్ను రేటును తగ్గించేందుకు అనుమతించలేమని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: కండోమ్స్‌పై జీఎస్టీ తగ్గించేందుకు అనుమతించాలంటూ పాక్ చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) తోసి పుచ్చింది. ఈ అంశంపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే చర్చించగలుగుతామని తేల్చి చెప్పింది. దీంతో, పాక్‌కు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది (IMF Reject Pak's Condom GST Rate Cut)
ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్థాన్ ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్), ప్రపంచబ్యాంకు ఇచ్చిన అప్పులతో రోజులు నెట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఐఎమ్ఎఫ్ మొత్తం 7 బిలియన్ డాలర్ల నిధుల మంజూరుకు అనుమతించింది. అయితే, తాము చెప్పినట్టు ఆర్థిక సంస్కరణలకు దిగాలని తేల్చి చెప్పింది. పలు కండీషన్లను విధించింది. వీటిల్లో కొన్నింటిని తక్షణం అమలు చేయాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే కండోమ్స్‌పై జీఎస్టీ తగ్గింపు కోసం పాక్ ఐఎమ్ఎఫ్‌ను ఆశ్రయించింది. ఇది ప్రధాని షహబాజ్ షరీఫ్ అభిమతమని, ఇందుకు అనుమతించాలని కోరుతూ పాక్‌లోని ఫెడరల్ రెవెన్యూ బోర్డు ఐఎమ్ఎఫ్‌కు ఈమెయిల్ చేసింది. అయితే, ఆర్థిక సంవత్సరం నడిమధ్యలో పన్నుల మినహాయింపు సాధ్యం కాదని ఐఎమ్ఎఫ్ స్పష్టం చేసింది. టార్గెట్స్ మేర ఆదాయాన్ని రాబట్టేందుకు పాక్ ఇప్పటికే ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తు చేసింది. శానిటరీ ప్యాడ్స్, బేబీ డయపర్స్‌పై జీఎస్టీ కోత ప్రతిపాదనను కూడా ఐఎమ్ఎఫ్ తిరస్కరించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మాత్రమే వీటిపై చర్చించగలమని పేర్కొంది.
పాక్‌లో జనాభా పెరుగుదల భారీగా ఉంది. ప్రస్తుతం అక్కడి జనాభా వృద్ధి రేటు 2.55. ప్రపంచంలో ఇదే అత్యధికం. అక్కడ ఏటా 6 మిలియన్‌ల మేర జనాభా పెరుగుతోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుండటం ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణకు పాక్ చేస్తున్న ప్రయత్నాలకు ఐఎమ్ఎఫ్ రూపంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఇవీ చదవండి:
పాక్ గగనతలంలోకి భారత్ విమానాల నిషేధం.. జనవరి 23 వరకూ పొడిగింపు
మరో 7 దేశాల పర్యాటకులపై అమెరికా నిషేధం!
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి