World Bank : భారత్‌పై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

ABN , First Publish Date - 2023-09-08T15:26:32+05:30 IST

భారత దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (DPIs) పరిణామాత్మక ప్రభావాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత దశాబ్దంలో ఈ రంగంలో వచ్చిన మార్పులపై రూపొందించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.

World Bank : భారత్‌పై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

న్యూఢిల్లీ : భారత దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (DPIs) పరిణామాత్మక ప్రభావాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత దశాబ్దంలో ఈ రంగంలో వచ్చిన మార్పులపై రూపొందించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఆర్థిక సమ్మిళితత్వం కోసం జీ20 గ్లోబల్ పార్టనర్‌షిప్‌లో భాగంగా ఈ డాక్యుమెంట్‌ను రూపొందించింది. డీపీఐ వ్యవస్థ రూపకల్పనలో మోదీ ప్రభుత్వ విధానాల పాత్ర గురించి వివరించింది.

ప్రపంచ బ్యాంకు ఈ నివేదికలో వెల్లడించిన ప్రధానాంశాలు:

- ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధించడానికి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ నంబర్ (JAM) అనుసంధానం ఎంతో ఉపయోగపడింది. కేవలం ఆరు సంవత్సరాల్లోనే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రేటు 25 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది. 47 సంవత్సరాల్లో సాధించే ఆర్థిక సమ్మిళితత్వం కేవలం ఆరు సంవత్సరాల్లోనే సాధ్యమైంది. దీనికి ప్రధాన కారణం డీపీఐలే.


- ఆర్థిక సమ్మిళితత్వం వేగంగా జరగడంలో డీపీఐల పాత్ర చాలా ముఖ్యమైనది అయినప్పటికీ, డీపీఐలు అందుబాటులో ఉండేలా చేసిన ఇతర పరిస్థితులు, విధానాలు కూడా మరింత ముఖ్యమైనవి. చట్టపరమైన, నియంత్రణలపరమైన నిబంధనావళి మరింత ప్రోత్సాహకరంగా ఉండేలా చేయడం, అకౌంట్ యాజమాన్యం విస్తరణకు జాతీయ విధానాల అమలు, గుర్తింపు తనిఖీ కోసం ఆధార్‌ను అనుసంధానం చేయడం వంటివి చాలా ముఖ్యమైన అంశాలు.

- భారత దేశంలోని డీపీఐ కేవలం ప్రభుత్వ రంగాన్ని మాత్రమే కాకుండా ప్రైవేటు రంగాన్ని కూడా మార్చింది. కొన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్ఎంఈ లెండింగ్‌లో 8 శాతం హయ్యర్ కన్వర్షన్ రేటు నమోదైంది. తరుగుదల ఖర్చుల్లో 65 శాతం తగ్గుదల, మోసాల గుర్తింపు కోసం జరిగే ఖర్చుల్లో 66 శాతం తగ్గుదల నమోదైంది.

- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) గొప్ప విజయం సాధించింది. 2023 మే నెలలో 9.41 బిలియన్ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.14.89 ట్రిలియన్లు.

- భారత్-సింగపూర్ మధ్య యూపీఐ-పేనౌ (UPI-PayNow) కార్యకలాపాలు 2023 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. దీనివల్ల ఇరు దేశాల మధ్య చెల్లింపుల్లో వేగం, పారదర్శకత పెరిగాయి, ఖర్చులు ఆదా అవుతున్నాయి. జీ20 ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విధానానికి అనుగుణంగా ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి :

నగరంలో.. నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం

Sanatana Dharmam : సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-09-08T15:30:41+05:30 IST