Sanatana Dharmam : సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-08T10:07:39+05:30 IST

గతంలో జరిగిన అనేక దాడులు సనాతన ధర్మానికి నష్టం కలిగించలేకపోయాయన్నారు. నేడు కూడా పరాన్నజీవులు అధికార దాహంతో చేసే దాడుల వల్ల ఎటువంటి హాని జరగదని స్పష్టం చేశారు.

Sanatana Dharmam : సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
Yogi Adithyanath

లక్నో : సనాతన ధర్మంపై దాడి ఇటీవలి కాలంలో తీవ్రతరమైన నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. గతంలో జరిగిన అనేక దాడులు సనాతన ధర్మానికి నష్టం కలిగించలేకపోయాయన్నారు. నేడు కూడా పరాన్నజీవులు అధికార దాహంతో చేసే దాడుల వల్ల ఎటువంటి హాని జరగదని స్పష్టం చేశారు.

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. అయినప్పటికీ, కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర, కాంగ్రెస్ నేతలు కార్తి చిదంబరం, ప్రియాంక్ ఖర్గే, డీఎంకే నేత ఏ రాజా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వంటివారు ఉదయనిధి స్టాలిన్‌ను సమర్థిస్తున్నారు.

యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ట్వీట్‌లో, రావణాసురుడి దురహంకారం సనాతన ధర్మాన్ని అంతం చేయలేకపోయిందని, కంసుడి గర్జన కదిలించలేకపోయిందని, బాబర్, ఔరంగజేబు దురాగతాలు నాశనం చేయలేకపోయాయని, అటువంటి సనాతన ధర్మం అధికార దాహంగల నేటి చిల్లర పరాన్నజీవుల వల్ల నాశనమవుతుందా? అని ప్రశ్నించారు.


యోగి ఆదిత్యనాథ్ గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పోలీస్ లైన్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సనాతన ధర్మంపై వేలెత్తి చూపడం, మానవాళిని ఇబ్బందుల్లోకి నెట్టాలనే దుష్ట సంకల్పమేనని తెలిపారు. సనాతన ధర్మం అంటే సూర్యుని వలే శక్తికి మూలమని తెలిపారు. కేవలం మూర్ఖుడు మాత్రమే సూర్యునిపై ఉమ్మి వేయాలని అనుకుంటాడని దుయ్యబట్టారు. సూర్యునిపై ఉమ్మి వేస్తే, తిరిగి ఆ వ్యక్తి ముఖంపైకే వస్తుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను ప్రస్తావిస్తూ, వాటి భావి తరాలు వాటి తప్పుల వల్ల ఎంతో సిగ్గుతో తలదించుకుంటాయన్నారు. భారత దేశ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గర్వకారణంగా భావించాలన్నారు. భగవంతుడిని నాశనం చేయాలనుకున్నవారంతా నాశనమైపోయారని చెప్పారు. 500 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం అవమానానికి గురైందని, నేడు అయోధ్యలో రామాలయం నిర్మితమవుతోందని చెప్పారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. భారత దేశ ప్రగతికి ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అయితే ప్రతిపక్షాల ప్రయత్నాలు ఫలించబోవని స్పష్టం చేశారు.

‘‘ప్రతి యుగంలోనూ సత్యాన్ని మరుగుపరచేందుకు ప్రయత్నాలు జరిగాయి. అబద్ధమాడటానికి రావణాసురుడు ప్రయత్నించలేదా? అంతకుముందు హిరణ్యకశిపుడు భగవంతుడిని, సనాతన ధర్మాన్ని అవమానించడానికి ప్రయత్నించలేదా? భగవంతుని అధికారాన్ని కంసుడు సవాల్ చేయలేదా? వారి దుర్మార్గపు ప్రయత్నాల్లో వారే నాశనమయ్యారు. సనాతన ధర్మం శాశ్వతమైన సత్యమనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దీనికి ఎవరూ హాని చేయలేరు’’ అని యోగి చెప్పారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు యోగి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారమని, సత్యం, న్యాయం, ధర్మ స్థాపన కోసమే ఆయన శ్రీకృష్ణునిగా అవతరించారని తెలిపారు.


ఇవి కూడా చదవండి :

నగరంలో.. నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం

Special buses: వారాంతపు సెలవులు.. నేడు 600 ప్రత్యేక బస్సులు

Updated Date - 2023-09-08T10:07:39+05:30 IST