IMF: ప్రపంచ వృద్ధికి భారతదేశం ఒక కీలక ఇంజిన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి MD క్రిస్టాలినా జార్జివా
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:08 PM
భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా చెప్పారు. చైనా వృద్ధి మందగిస్తోండగా, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. టారిఫ్స్ వల్ల అమెరికా అభివృద్ధి..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా చెప్పారు. భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోందని కూడా ఆమె ప్రకటించారు. 2025 IMF-వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాలకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది IMF-వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాలు నిన్న(అక్టోబర్ 13, 2025) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు అక్టోబర్ 18, 2025 వరకు వాషింగ్టన్ డీసీలో జరుగుతాయి. ఈ సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలన, అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు.
ఇదే సమయంలో క్రిస్టాలినా చైనా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా వృద్ధి మందగిస్తోండగా, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకభూమిక పోషిస్తోందని ఆమె చెప్పారు. 'గ్లోబల్ గ్రోత్ ప్యాటర్న్‌లు మారుతున్నాయి. చైనా మందగిస్తుంటే, భారతదేశం కీ గ్రోత్ ఇంజిన్‌గా ఆవిర్భవిస్తోంది' అని ఆమె స్పష్టం చేశారు.
ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మెరుగైన పాలసీలు, ప్రైవేట్ సెక్టార్ అనుకూలత, టారిఫ్ ప్రభావాలు తక్కువగా ఉండటం, సానుకూల ఆర్థిక పరిస్థితులు కారణాలుగా ఉంటాయని ఆమె తెలిపారు. ప్రపంచ వాణిజ్యంపై కూడా క్రిస్టాలినా మాట్లాడతూ మారుతున్న ట్రేడ్ టారిఫ్స్ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది తేలాలంటే కొంత సమయం ఆగాల్సి ఉందని ఆమె చెప్పారు . ప్రస్తుత ట్రేడ్ టారిఫ్స్ కారణంగా అమెరికాలో ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉందని, ఇది మానిటరీ పాలసీ, ఆ దేశ అభివృద్ధి మీద ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.
ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు కూడా పలు సూచనలు చేశారు క్రిస్టాలినా. 'ప్రపంచ దేశాలూ.. మీ రుణాన్ని తగ్గించుకోండి, అది మీ ఆర్థిక వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది'అని ఆమె హెచ్చరించారు. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతోన్న దేశాలు రెండిటిలోనూ రుణ స్థాయిలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయని జార్జివా వ్యాఖ్యానించారు.
క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్. ఆమె బల్గేరియాకు చెందిన ఆర్థికవేత్త. 2019 అక్టోబర్ 1 నుంచి IMF మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె మొదటి ఐదేళ్ల పదవీకాలం 2024లో ముగిసిన తర్వాత, 2024 ఏప్రిల్‌లో రెండోసారి ఐదేళ్ల పదవీకాలం కోసం ఆమె ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం
కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్
దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
For More National News And Telugu News