Israel Gaza Attack: హమాస్ శాంతి ఒప్పందానికి సిద్ధమన్న ట్రంప్.. ఇంతలో మళ్లీ ఇజ్రాయెల్ దాడులు
ABN, Publish Date - Oct 04 , 2025 | 01:55 PM
హమాస్ శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడింది. తాజాగా జరిగిన దాడిలో సుమారు ఆరుగురు కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మళ్లీ చుక్కెదురైంది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు హమాస్‌కు ట్రంప్ నిన్న (శుక్రవారం) డెడ్‌లైన్ విధించారు. అయితే, శాంతి నెలకొల్పేందుకు హమాస్ సిద్ధంగానే ఉందని తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు ఆరుగురు కన్నుమూశారు. ఓసారి జరిగిన దాడిలో ఒకే ఇంట్లోని నలుగురు దుర్మణం చెందారు. మరోసారి ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఇద్దరు కన్నుమూశారు. అయితే, గాజాలో మిలిటరీ చర్యలను తగ్గించాలని ఇజ్రాయెల్ అధినాయకత్వం భావిస్తున్నట్టు దాడుల అనంతరం స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి (Israel attacks Gaza).
అంతకుమునుపు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్పందిస్తూ ట్రంప్ ప్లాన్‌లో తొలి దశను తక్షణం అమలు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, మిలిటరీ చర్యలను కట్టిపెడతారా, లేదా? అన్న విషయంలో మాత్రం మౌనం పాటించింది.
రెండేళ్లుగా సాగుతున్న గాజా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. శాంతిని నెలకొల్పేందుకు హమాస్ సిద్ధంగా ఉందని తాను నమ్ముతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక బంతి ఇజ్రాయెల్ కోర్టులో ఉందని వ్యాఖ్యానించారు. గాజాపై బాంబుల దాడిని ఇజ్రాయెల్ కట్టిపెట్టి, బందీలను సురక్షితంగా వెనక్కు తెచ్చుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ యుద్ధాన్ని త్వరగా ముగించాలని చెప్పారు.
2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి తరువాత ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. హమాస్ అప్పట్లో జరిపిన దాడిలో 1200 మంది మృతిచెందారు. మరో 251 మందిని బందీలుగా చేసి హమాస్ తీసుకెళ్లిపోయింది. ఇక ఇజ్రాయెల్ యుద్ధం మొదలెట్టాక గాజాలో సుమారు 66 వేల మంది మరణించారని అక్కడి అధికారులు చెబుతున్నారు. మానవతాసాయం అందడంలోనూ ఆటంకాలు ఏర్పడుతుండటంతో క్షామం తరహా పరిస్థితులు నెలకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన న్యాయపోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్
డ్రగ్స్ బోటుపై అమెరికా మిలిటరీ దాడి.. నలుగురు మృతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 04 , 2025 | 04:31 PM