India US Friendship: భారత్–అమెరికా మధ్య స్నేహ బంధం మరింత బలపడుతోంది: రూబియో
ABN, Publish Date - Sep 23 , 2025 | 06:56 AM
భారత్–అమెరికా సంబంధాల్లో వాణిజ్య వివాదాలు, హెచ్-1బీ వీసాలపై అభిప్రాయభేదాలు కనిపిస్తున్నప్పటికీ, ఈ రెండు దేశాల మధ్య స్నేహ బంధం బలపడుతోందని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయిన క్రమంలో వెల్లడించారు.
భారత్ అమెరికాకు కీలకమైన భాగస్వామిగా కొనసాగుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో (Rubio) స్పష్టం చేశారు. ఈ రెండు దేశాల మధ్య స్నేహం ఇంకా బలంగానే (India US relations) ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాష్ట్ర సమావేశాల సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ లాట్ న్యూయార్క్ ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా రూబియో భారత్‌తో సంబంధాలు అమెరికాకు చాలా కీలకమైనవి మరోసారి గుర్తు చేశారు.
భేటీలో ప్రధానంగా
ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, కీలక ఖనిజాల వంటి అనేక అంశాలపై చర్చలు జరిగాయి. జైశంకర్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ పోస్ట్‌లో ఈ సమావేశం గురించి తెలిపారు. మా భేటీలో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించాం. ప్రాధాన్యతా అంశాల్లో పురోగతి కోసం నిరంతర సంప్రదింపుల మీద ఒప్పందం కుదిరింది. మేం సన్నిహితంగా ఉంటామని పేర్కొన్నారు.
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త ఊపు
గత కొన్ని నెలలుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో కొంత గందరగోళం కనిపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 50 శాతం టారిఫ్‌ను విధించారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్‌లో యుద్ధ విరమణ కోసం రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా వచ్చింది.
వైట్ హౌస్ అధికారులు, ముఖ్యంగా పీటర్ నవారో వంటి వారు భారత్-రష్యా సంబంధాలపై విమర్శలు చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ కూడా ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు కలిసి ఒక ముందడుగు వేశారు. ఇరు దేశాలు వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు.
భారత బృందం
ఈ పరిణామాల నేపథ్యంలో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం అమెరికాకు చేరుకున్నారు. న్యూయార్క్‌లో ఆయన అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వేగవంతం చేయడానికి కీలక భేటీ కానుంది. గోయల్ నేతృత్వంలోని భారత బృందం ఈ చర్చలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయనుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 23 , 2025 | 07:04 AM