Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు భారీగా నగదు.. ఎంతంటే?
ABN, Publish Date - Oct 10 , 2025 | 04:07 PM
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 'మరియా కొరినా మచాడో'ను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరినా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆమెకు ఎంత నగదు వస్తుంది, ఇతర ప్రత్యేక సదుపాయాలు ఏమి ఉంటాయనే విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా నోబెల్ బహుమతికి గుర్తింపు ఉంది. ఈ బహుమతిని స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) జ్ఞాపకార్థం 1901 నుంచి ప్రతి ఏటా ప్రదానం చేస్తున్నారు. శాంతి, సాహిత్యం, వైద్యశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి ఆరు కేటగిరీల్లో ఈ బహుమతిని అందజేస్తారు. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రం విభాగాల్లో నోబెల్ ఫ్రైజ్ ను ప్రకటించారు. శుక్రవారం సైతం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) 'మరియా కొరినా మచాడో'ను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరినా (Maria Corina Machado) ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది.
నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆమెకు ఎంత నగదు వస్తుంది, ఇతర ప్రత్యేక సదుపాయాలు ఏమి ఉంటాయనే విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతిని (Nobel Peace Prize) గెలుచుకున్న వ్యక్తికి బంగారు మెడల్, డిప్లోమా సహా దాదాపు 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్ (భారత కరెన్సీలో రూ.8.5 కోట్లు) నగదు బహుమతిగా ఇస్తారు. ఈ ఏడాది నోబెల్ పతకాన్ని గుస్తావ్ విగెలాండ్ రూపొందించారు. నోబెల్ శాంతి బహుమతి నార్వే రాజధాని ఒస్లోలో ప్రదానం చేయబడుతుంది. మిగతా బహుమతులను స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ లో గ్రహితలకు అందజేస్తారు. నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ శాంతి, విజ్ఞాన ప్రగతి, మానవ సంక్షేమానికి, అభివృద్ధికి అపారమైన కృషి చేసిన వారికి అందిస్తుంటారు. అందుకే ఈ ఫ్రైజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, మానవతా విలువల ప్రతీకగా నిలుస్తుంది.
ఇక, ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విషయానికి వస్తే.. ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనేక ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ ఏడాది మొత్తం 338 మంది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా.. నోబెల్ కమిటీ మెంబర్స్.. మరియా వైపు మొగ్గుచూపారు. నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 10 , 2025 | 07:25 PM