Kirk Murder Suspect Photo: చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడి ఫొటోను రిలీజ్ చేసిన ఎఫ్‌బీఐ
ABN, Publish Date - Sep 12 , 2025 | 02:47 PM
కిర్క్ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ యువకుడి ఫొటోను అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తాజాగా విడుదల చేసింది. ఫొటోలోని యువకుడి గురించి తెలిసిన వారు అతడి వివరాలను తమకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా ఓ అనుమానితుడి ఫొటోను విడుదల చేసింది. బేస్ బాల్ క్యాప్ పెట్టుకుని ఉన్న యువకుడి ఫొటోను యూటా రాష్ట్ర పోలీసు శాఖతో కలిసి విడుదల చేసింది. ఫొటోలోని యువకుడు బ్యాక్ ప్యాక్ (కాలేజీ బ్యాగు), అమెరికా జెండా చిత్రం ఉన్న టీషర్టుతో కనిపించాడు. అతడి వివరాలు తెలిసిన వారు ముందుకు రావాలని ఎఫ్‌బీఐ అధికారులు కోరారు. నిందితుడు ఉపయోగించినట్టు భావిస్తున్న హైపవర్డ్ రైఫిల్‌ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఇక కిర్క్ హంతకుడి వివరాలు చెప్పిన వారికి లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు (Charlie Kirk murder suspect photo).
కిర్క్ హత్య జరిగి దాదాపు 24 గంటలు గడుస్తున్నా ఇంకా పోలీసులు నిందితుడి జాడ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఓ భవనం టాపుపై దాక్కుని కిర్క్‌పై కాల్పులు జరిపిన నిందితుడు తనను ఇతరులెవరూ గుర్తించక ముందే పరారయ్యాడు. స్థానిక సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతడు కాలేజీ విద్యార్థి వయసులోని వాడై ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితుడిని పట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని పోలీసులు తాజాగా తెలిపారు. హంతుకుడు పేల్చిన తూటా కాట్రిడ్జ్, మూడు రౌండ్స్ లోడ్ అయ్యి ఉన్న మ్యాగ్జైన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కాలిఅడుగు జాడలను కూడా గుర్తించామని అన్నారు (FBI Utah manhunt Charlie Kirk case).
యూటా వ్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో పట్టపగలు చార్లీ కిర్క్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మెడకు తూటా తగలడంతో తీవ్ర రక్తస్రావమై కన్నుమూశారు. ఇందుకు సంబంధించి పలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కిర్క్ ప్రసంగిస్తున్న ప్రాంతానికి సుమారు 100 మీటర్ల దూరంలోని భవనం నుంచి నిందితుడు కాల్పులు జరిపి పారిపోయినట్టు ఈ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై అమెరికా సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ( Charlie Kirk Murder Investigation). అమెరికా సోషల్ మీడియాలో అపార ఫాలోయింగ్ ఉన్న కిర్క్.. ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ట్రంప్‌నకు విజయం చేకూర్చేలా సంప్రదాయవాద అమెరికన్ యువత మద్దతును కూడగట్టారు.
ఇవి కూడా చదవండి:
సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్
చార్లీ కిర్క్ హత్య.. వైరల్ వీడియోల్లో కీలక విషయాలు వెలుగులోకి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 12 , 2025 | 03:32 PM