Charlie Kirk: చార్లీ కిర్క్ హత్య.. వైరల్ వీడియోల్లో కీలక విషయాలు వెలుగులోకి
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:09 PM
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యోదంతం అమెరికాలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, సంప్రదాయ వాది చార్లీ కిర్క్ హత్యోదంతం అక్కడి రాజకీయాల్లో కలకలం రేపుతోంది. యూటా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరగడంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హత్యకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి (Charlie Kirk shot dead).
దాదాపు 3 వేల మంది అతడి ప్రసంగం వింటున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. కిర్క్ మెడకు తూటా తగలడంతో అతడు కుప్పకూలిపోయింది. రక్తం ధారాపాతంగా కారింది. కిర్క్ ప్రసంగిస్తున్న ప్రాంతానికి సుమారు 150 మీటర్ల దూరంలో ఉన్న భవనంపై నుంచి కాల్పులు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఒకే తూటా కిర్క్ మెడకు తగిలిందని అన్నారు. రక్తస్రావాన్ని ఆపేందుకు కిర్క్ తన చేయిని మెడకు అడ్డుపెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. షూటింగ్‌కు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి ఆ భవనంపై అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టు ఉన్న వీడియో కూడా కలకలం రేపుతోంది (Utah shooting Charlie Kirk).
గన్ను పేలిన శబ్దం వినగానే అక్కడున్న వారందరూ చెల్లాచెదురుగా పారిపోయారు. కిర్క్ టార్గెట్‌గా ఈ కాల్పులు జరిగాయని యూటా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి విషయంలో సందేహించాల్సింది ఏమీ లేకపోవడంతో విడిచిపెట్టారు. ఈ కేసులో ఇప్పటివరకూ స్థానిక పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు (US political violence).
సంప్రదాయ వాది అయిన కిర్క్.. ట్రంప్ ప్రధాన మద్దతుదారుల్లో ఒకరు. వలసలను తీవ్రంగా వ్యతిరేకించిన అతడు భారతీయులకు వీసాలను నిలిపివేయాలని ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేశారు. అమెరికన్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని వివిధ వేదికల్లో తన వాదనను బలంగా వినిపించారు. ఇక ఆపరేషన్ సిందూర్‌పై కూడా ఆయన గతంలో మాట్లాడారు. పాక్‌ను జిత్తులమారి దేశంగా అభివర్ణించారు. పాక్‌లో దాక్కున్న ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు మట్టుపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ యుద్ధంలో భారత్‌కు అమెరికా నైతిక మద్దతు ఇవ్వడం మినహా మరే విధంగానూ జోక్యం చేసుకోకూడదని అన్నారు. ప్రపంచంలో తలెత్తే ప్రతి ఘర్షణలోనూ అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనేది కిర్క్ అభిప్రాయం.
ఇవి కూడా చదవండి:
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్
నేపాల్ మహిళా మంత్రి జీవితం తలకిందులు.. ప్రజాగ్రహం వెల్లువెత్తితే ఇంతే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి