Donald Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన
ABN, Publish Date - Aug 30 , 2025 | 02:54 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని అమెరికా అధ్యక్ష కార్యాలయం..
తీవ్రమైన గుండె వ్యాధి లక్షణాలనే అంచనాలు
చర్మవ్యాధి కావొచ్చనే విశ్లేషణలు
ట్రంప్ ఆరోగ్యం బాగుంది: వైట్‌హౌస్ వైద్యులు
చేతి వెనుక వంకాయ రంగు మచ్చ, ఉబ్బిపోయిన కళ్లు
వాషింగ్టన్, ఆగస్టు 29: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం వైద్యుడు, ఇతర అధికారులు చెబుతున్నా.. కొంతకాలం నుంచి ఆయనను గమనిస్తున్నవారు ట్రంప్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాలి చీలమండల వద్ద వాపు, కుడిచేతి వెనకాల కమిలిపోయినట్టుగా వంకాయ రంగు పెద్ద మచ్చ, ఉబ్బిపోయిన కళ్లు, రంగుమారిపోయిన పెదవులు, నడిచేప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుండటం వంటివాటిని ప్రస్తావిస్తున్నారు. ఇవి తీవ్రమైన గుండె వ్యాధి, దానికి వాడే మందుల దుష్ప్రభావాల లక్షణాలని విశ్లేషిస్తున్నారు.
ఇటీవల అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆహ్వానించే సమయంలో.. ట్రంప్ కార్పెట్‌పై నేరుగా కాకుండా, కాస్త తూలుతున్నట్టుగా అటూఇటూ నడిచారని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ కుడిచేతిపై మచ్చ చర్చనీయాంశం కావడంతో శ్వేతసౌధం వైద్యుడు సియాన్ బార్బబెల్లా ఇటీవల వివరణ ఇచ్చారు. రక్తాన్ని పలుచన చేసే ఆస్ర్పిన్ వాడుతున్న ట్రంప్.. ఇటీవల చాలా మందిని కలసి కరచాలనం చేయడంతో చర్మం రాపిడికి గురై మచ్చ ఏర్పడిందని చెప్పారు. ట్రంప్ వయసు ప్రస్తుతం 79 ఏళ్లు అని, ఈ వయసులో ఇలాంటి సమస్యలు సాధారణమేనని, తీవ్రమైన గుండె, రక్తనాళాల వ్యాధులేమీ లేవని పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ చేతిపై మచ్చ ‘సెనైల్ పర్పురా’ కావొచ్చని.. రక్తాన్ని పలుచన చేసే మందులు (బ్లడ్ తిన్నర్స్), స్టెరాయిడ్స్ వాడే పెద్ద వయసు వారిలో ఈ సమస్య వస్తుందని చర్మసంబంధిత అంశాల వెబ్‌సైట్ ‘డెర్మ్‌నెట్’ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..
Updated Date - Aug 30 , 2025 | 07:55 AM