Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..
ABN , Publish Date - Aug 29 , 2025 | 10:44 AM
రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బీ డివిజన్ల నుండి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 794 సమస్యాత్మక రోడ్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మొత్తం 1039 కి.మీ రోడ్లు దెబ్బతిన్నాయని నివేదిక వచ్చినట్లు చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. పలు జిల్లాలు జలమయం అయ్యాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వంతెనలు కూలాయి. కల్వర్టులు కొట్టుకుపోయాయి. వాగులు పొంగాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధమయ్యాయి. రహదారులు ధ్వంసమై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో గంటలకొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బీ డివిజన్ల నుండి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 794 సమస్యాత్మక రోడ్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మొత్తం 1039 కి.మీ రోడ్లు దెబ్బతిన్నాయని నివేదిక వచ్చినట్లు చెప్పారు. 31 చోట్ల రోడ్లు తెగిపోగా, 10 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేపట్టినట్లు స్పష్టం చేశారు. 356 చోట్ల కాజ్‌వేలు, కల్వర్టులు ధ్వంసం అయ్యాయన్నారు. 289 చోట్ల దారి మళ్లింపు చర్యలు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. రాకపోకలకు ఇబ్బంది ఉన్న 305 ప్రాంతాల్లో 236 ప్రాంతాలు ఇప్పటికే క్లియర్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం 206 చోట్ల సిడీ వర్క్స్ దెబ్బతిన్నాయని వివరించారు. తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.53.76 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు స్పష్టం చేశారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు రూ.1157.46 కోట్లు అవసరం అవుతుందని అధికారులు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు